పెత్తందారులకు జీహుజూర్
విడవలూరు: స్థానికంగా ఆక్రమణల తొలగింపు వ్యవహారం లోపభూయిష్టంగా మారింది. ఈ అంశంలో టీడీపీ నేతలు రంగప్రవేశం చేసి, తమకు అనుకూలంగా ఉండే వారి ఆస్తులను తొలగించకుండా.. ఇతరులవి ధ్వంసం చేసేలా రూపకల్పన చేశారు. వీరే సర్వే అధికారులుగా అవతారమెత్తారంటే ఏమి జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ నేత పక్కనే ఉండి తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తుల ఇంటికి ఒకలా.. ఇతరుల గృహాలకు మరోలా మార్కింగ్‌లను వేయించారు. బాధిత కుటుంబాలు ప్రశ్నిస్తే, రోడ్డు క్రాస్ తిరిగిందంటూ అధికారులు సమాధానమిచ్చారు.
జరిగిందిదీ..
విడవలూరులోని సినిమా హాల్ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ఉన్న బుచ్చి – ఊటుకూరు రోడ్డును ఇరువైపులా ఆక్రమించారని, దీన్ని తొలగించి వెడల్పు చేయాలంటూ లోకాయుక్తను ఓ వ్యక్తి ఆశ్రయించారు. దీంతో ఆర్‌అండ్‌బీ స్థలాలను సర్వే చేసి ఆక్రమణలను తొలగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ క్రమంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న స్థలాల్లో మార్కింగ్‌లను సర్వే అధికారులు వేశారు. వీటిని ఈ నెల 12న తొలగించాలని, లేని పక్షంలో తామే రంగంలోకి దిగుతామంటూ నోటీసులను పంచాయతీ అధికారులు జారీ చేశారు. కాగా గృహాలను కూల్చేస్తే తామంతా రోడ్డున పడతామని, మరోసారి సర్వే చేసి న్యాయం చేయాలంటూ నెల్లూరులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు తహసీల్దార్‌కు ఆర్జీలను పలువురు అందజేశారు. దీంతో ఆక్రమణల తొలగింపును వాయిదా వేశారు. మరోసారి రీసర్వే చేసి కొత్త మార్కింగ్‌లు వేశారు.
అంతా కక్షపూరితం..
ఆక్రమణల తొలగింపు ప్రక్రియను ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ, సర్వే, పోలీస్, పంచాయతీ అధికారులు ఈ నెల 18న ప్రారంభించారు. ఇందులో టీడీపీ నేతలు దగ్గరుండి తాము వేసిన తప్పుడు మార్కింగ్‌ల మేరకే తొలగించాలంటూ పట్టుబట్టి అధికారులను ఒత్తిళ్లకు గురిచేశారు. అనుకున్న విధంగా ఇష్టానుసారంగా వ్యవహరించి కక్షపూరితంగా తొలగింపు ప్రక్రియను పూర్తి చేశారు.
వీపీఆర్ వాటర్ ప్లాంటా.. ఎక్కడా..?
రోడ్డు ఆక్రమణల పేరుతో గ్రామంలోని వారిని నష్టపర్చారు. అయితే రోడ్డు పక్కన ఆక్రమణలో ఉన్న వీపీఆర్ వాటర్ పాంట్‌ను మాత్రం విస్మరించారు. దీని పక్కనే నివాసముంటున్న 70 ఏళ్ల రఘురామయ్య పూరి గుడిసెను కూల్చేసి రోడ్డున పడేశారు.
టీడీపీ కార్యాలయానికి లైన్ క్లియర్
విడవలూరులోని మద్యం దుకాణానికి ఎదురుగా ఉన్న అరటి తోటను బుధవారం సాయంత్రం తొలగించారు. దీనికి సంబంధించి యజమానికి ఎలాంటి నోటీసులను ఇవ్వలేదు. 50 ఏళ్లుగా ఉంటున్న స్థలంలో చెట్లతో సహా తొలగించడంపై యజమాని రవి లబోదిబోమన్నారు. ముందు ఉన్న మూడు గృహాలను తొలగించడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. అరటితోట పక్కనే ఉన్న టీడీపీ మండల నేత పొలంలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలనే ఉద్దేశంతోనే ఈ దుర్మార్గానికి ఒడిగట్టారని ఆరోపిస్తున్నారు. అసలు కేసులేసింది పచ్చ పార్టీ నేతలే అయి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
విడవలూరులో లోపభూయిష్టంగా ఆక్రమణల తొలగింపు
టీడీపీ మద్దతుదారులకై తే ఓకే..
ఇతరులవైతే ధ్వంసమే
సర్వే అధికారుల అవతారమెత్తిన
పచ్చ నేతలు
పెత్తందారులకు జీహుజూర్
Comments
Please login to add a commentAdd a comment