కావలి: ఉపాధి హామీ పథకంలో ఏన్నో ఏళ్లుగా చిరు ఉద్యోగాలతో కుటుంబాలను పోషించుకుంటున్న ఎఫ్‌ఏలపై కూటమి నేతల వేధింపులు పతాక స్థాయికి చేరాయి. ఆయా స్థానాల్లో టీడీపీ నేతలను నియమించేందుకు అధికారులు నోటి మాటగా అధికారికంగా ఫైల్‌ను తయారు చేసి ఇప్పటికే ఉద్యోగాల నుంచి తొలగించారు. కోర్టు ఆదేశాలంటూ పోరాడుతున్న ఎఫ్‌ఏలపై అవినీతి ఆరోపణలతో రికవరీలతో ఇబ్బందులు పెడుతున్నారు. అందులో భాగంగానే కావలి మండలంలో సర్వాయపాళెం, రుద్రకోట, అడవిలక్ష్మీపురం, తుమ్మలపెంట, పెద్దపట్టపుపాళెం ఐదుగురు ఎఫ్‌ఏలను తొలగించారు. ఇక ఆముదాలదిన్నె ఎఫ్‌ఏ విషయంలో టీడీపీ నేతలు జోక్యం చేసుకుని తమ వాడని చెప్పడంతో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీస్ ఇచ్చి సరిపెట్టారు. తొలగించిన ఎఫ్‌ఏలు అందరూ కూడా 15, 10 ఏళ్ల నుంచి నెలకు రూ.10 వేలు మాత్రమే జీతంగా తీసుకుంటూ పని చేస్తున్నారు. వీరిని తొలగించడానికి జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) పీడీ గంగాభవాని మంగళవారం ఏకంగా కావలి ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. సామాజిక తనిఖీ ప్రజావేదికలో ఉపాధి హామీ పనుల్లో కూలీల హాజరు, పనుల కొలతల్లో తేడాలకు సంబంధించి రూ.11,37,684 అవినీతి జరిగిందని ప్రకటించారు. జరిగిన నష్టం నగదును తొలగించిన ఎఫ్‌ఏల నుంచి వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని డ్వామా పీడీ ప్రకటించారు.
సోషల్ ఆడిట్‌లో రికవరీలు పడిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నాం. రూ.లక్షల్లో రికవరీలు ఉన్న సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. ఆ ప్రకారం అక్రమాలకు పాల్పడిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. రికవరీలకు సంబంధించి ఎఫ్‌ఏలు తమ వద్ద ఉన్న వివరాలను డిస్ట్రిక్ట్ విజిలెన్స్ ఆఫీసర్, ఉన్నతాధికారులకు చూపించి తగ్గించుకునే అవకాశం ఉంది.
– గంగాభవాని, డ్వామా పీడీ
పరిశీలించి చర్యలు తీసుకుంటాం
Comments
Please login to add a commentAdd a comment