వింజమూరు(ఉదయగిరి): విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన మండలంలోని బుక్కాపురంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కృష్ణ (48) తనకున్న నాలుగెకరాల వ్యవసాయ భూమిలో పైరుకు నీరు పెట్టేందుకు ఉదయం 6.30 గంటల సమయంలో వెళ్లారు. ఆ సమయంలో మోటార్ సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్ హెడ్ ఫ్యూజ్ కాలిపోవడాన్ని గమనించారు. దాన్ని సరిచేసే నిమిత్తం స్తంభమెక్కి విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయారు. ఎంతకీ రాకపోవడంతో భార్య ఫోన్ చేసినా ప్రయోజనం లభించలేదు. దీంతో పొలం వద్దకు కుటుంబసభ్యులు హుటాహుటిన వెళ్లగా నేలపై పడి ఉన్నారు. ఆయన్ను లేపి మాట్లాడగా, షాక్‌కు గురయ్యానని చెప్పడంతో ఆటోలో వింజమూరులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలున్నారు. పెద్ద దిక్కు మృత్యువాతపడటంతో కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment