మూడు చోట్ల సంతలు.. చేతులు మారిన రూ.లక్షలు
అరె!
మీరు మాకన్నా
మేయడంలో
గొప్పోళ్లు!
తినడంలో
మిమ్మల్ని
మించిపోయాం!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కోవూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు పశువుల రక్తమాంసాలతో వ్యాపారం చేస్తున్నారు. పాడి పశువులను కబేళాలకు తరలించేందుకు ఏకంగా మూడు చోట్ల సంతలను ఏర్పాటు చేసి కమీషన్లతో జేబులు నింపుకుంటున్నారు. వారానికి రెండు రోజుల పాటు నిర్వహిస్తూ మూగజీవాల ఉసురుపోసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో గతంలో నెల్లూరు పెన్నావంతెన, చిల్లకూరు ప్రాంతాల్లో ఉండే పశువుల సంతల నిర్వాహకులు పశువులను కబేళాలకు పంపించడం మహాపాపమని భావించి ఎత్తేయడంతో ఆ వ్యాపారాన్ని కోవూరు టీడీపీ నేతలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలో ప్రస్తుతం కోవూరు నియోజకవర్గంలో మూడు చోట్ల సంతలను ఏర్పాటు చేసి పశువుల అక్రమ రవాణాను ప్రోత్సహిస్తుండడంపై ఆ పార్టీ శ్రేణులే ఛీదరించుకుంటున్నాయి.
పంచాయతీ పాలకవర్గం
అనుమతి లేకుండానే కార్యదర్శి ఉత్తర్వులు
కోవూరు పంచాయతీలో సంత నిర్వహించేందుకు ఆగమేఘాల మీద పంచాయతీ కార్యదర్శి ఉత్తర్వులిచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ సంత నిర్వహణకు ఈ ఏడాది జనవరి 6వ తేదీ దరఖాస్తు చేసుకుంటే అదే రోజు పంచాయతీ తీర్మానం చేసినట్లు, ఫిబ్రవరి 3వ తేదీ సిఫార్సు, ఫిబ్రవరి 4వ తేదీ ఈఓపీఆర్డీ, అదే రోజు డివిజనల్ పంచాయతీ అధికారి అంగీకారం మేరకు ఫిబ్రవరి 5వ తేదీన కోవూరు పంచాయతీ కార్యదర్శి సంత నిర్వహణకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రక్రియను పరిశీలిస్తే దరఖాస్తు చేసిన రోజునే పంచాయతీ తీర్మానం చేయడం, మూడు రోజుల్లో పంచాయతీ కార్యదర్శి నుంచి డివిజనల్ పంచాయతీ అధికారి వరకు ఆగమేఘాల మీద అనుమతుల్వివడం చూస్తుంటే ఏ స్థాయిలో ముడుపులు చేతులు మారాయో అర్థమవుతోంది. వేరెవరైనా అనుమతులకు దరఖాస్తు చేసుకుంటే.. ఇంత వేగంగా ప్రభుత్వ శాఖలు అనుమతి ఇస్తాయా? ఇచ్చినా దాఖాలు ఉన్నాయా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలాఉంటే కోవూరులో సంత నిర్వహణకు పంచాయతీ పాలకవర్గానికి తెలియకుండానే ఈ ప్రక్రియ అంతా పంచాయతీ కార్యదర్శి నడిపించినట్లు విమర్శలు ఉన్నాయి. బోగస్ పంచాయతీ తీర్మానంతో ఆగమేఘాల మీద సంత నిర్వహణ ఏడాది పాటు చేసుకునేందుకు ఏకంగా నిబంధనలు ఉల్లంఘించి రాత్రికి రాత్రే ఉత్తర్వులు ఇవ్వడం పెద్ద దుమారం రేపింది. అయితే పాలకవర్గం ఉన్నప్పటికి వారి అనుమతి లేకుండానే కోవూరు పంచామతీ కార్యదర్శి మండల స్థాయి నేతకు నిర్వహణ ఉత్తర్వులు ఎలా ఇస్తారంటూ పాలకవర్గం నిలదీసింది. తమపై వస్తున్న రాజకీయ ఒత్తిళ్ల క్రమంలోనే ఉత్తర్వులు ఇచ్చేశానని కార్యదర్శి బహిరంగంగానే చెబుతుండడం గమనార్హం.
కోవూరులో ఏర్పాటు చేసిన సంతలో కట్టేసిన పశువులు
రవాణాకు పశుసంవర్థక శాఖ అనుమతుల్లేకుండానే..
పశువులను కబేళాలకు తరలించేందుకు పశుసంవర్థక శాఖ వైద్యుల అనుమతి ముఖ్యం. ఒట్టిపోయిన పశువులనే కబేళాలకు తరలించాల్సి ఉంది. జబ్బున పడ్డ పశువులను ఏమాత్రం కబేళాలకు తరలించకూడదు. ఇలాంటి నిబంధనల నేపథ్యంలో పశు వైద్యులు సర్టిఫై చేసిన పశువులనే కబేళాలకు తరలించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా రెండు.. మూడేళ్ల దూడల నుంచి పాలిచ్చే పశువుల వరకు ఈ సంతల నుంచి తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఈ సంతల నుంచి అపహరించిన పశువులను రవాణా చేస్తున్నారు. డబ్బు సంపాదించేదుకు అనేక మార్గాలు ఉన్నప్పటికీ పశువుల ఉసురుతో డబ్బు సంపాదించేందుకు ప్రభుత్వ శాఖల అధికారులతోపాటు అధికార పార్టీ నేతలు దిగజారిపోవడం పశు పోషకులతోపాటు మానవతావాదులను బాధిస్తోంది.
హిందుత్వ వాదులూ.. ఏమయ్యారో!
గోవధను నిషేధించాలంటూ ఉద్యమాలు చేసే హిందుత్వ సంఘాలు కోవూరు నియోజకవర్గం నుంచి పశువులను కబేళాలకు అధికార పార్టీ నేత లు అక్రమంగా తరలిస్తుంటే ఏం చేస్తున్నాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిత్యం దైవసేవలో ఉండే స్థానిక ప్రజాప్రతినిధి సైతం తన షాడో ఎమ్మెల్యేలు చేస్తున్న ఈ దురాగతాన్ని అడ్డుకోకపోవడాన్ని కూడా హిందువులు నిలదీస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పట్టీపట్టనట్ల ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కోవూరు, పడుగుపాడు పంచాయతీలతోపాటు కొడవలూరు మండలంలోని రేగడిచెలికలో పశువుల సంతలను ఏర్పాటు చేశారు. ఇందులో కోవూరు పంచాయతీలో సంత నిర్వహణకు అనుమతులు తీసుకుంటే.. పడుగుపాడు, రేగడిచెలిక సంతలకు కనీసం అనుమతులు కూడా లేవని తెలుస్తోంది. ప్రతి మంగళ, శుక్రవారాల్లో సంత నిర్వహణను ఏర్పాటు చేసేలా ఒప్పందం చేసుకున్నారు. ఇందు కోసం రూ.లక్షల్లో చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్క సంత నుంచి వారంలో రెండు రోజుల్లో కనీసం 100 నుంచి 150 లారీల్లో పశువుల అక్రమ రవాణా జరుగుతోంది. తద్వారా నెలకు రూ.లక్షల్లో కమీషన్లు వస్తున్నట్లు సమాచారం.
మూడు చోట్ల సంతలు.. చేతులు మారిన రూ.లక్షలు
Comments
Please login to add a commentAdd a comment