ఉపాధి పనుల్లో కూలీల పొట్టగొడుతున్నారు
● వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్
వింగ్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు
● ర్యాలీగా కలెక్టరేట్‌కు...
జేసీకి వినతిపత్రం అందజేత
నెల్లూరు రూరల్: నిబంధనలకు విరుద్ధంగా కూటమి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఉపాధి హామీ పనులు కట్టబెడుతూ కూలీల పొట్టగొడుతోందని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ వింగ్ జిల్లా అధ్యక్షుడు ఆలపాక శ్రీనివాసులు విమర్శించారు. ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు సోమవారం ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అనంతరం కలెక్టరేట్‌లో జేసీ కార్తీక్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలపాక శ్రీనివాసులు మాట్లాడుతూ ఉపాధి హామీ పనులను కాంట్రాక్టర్లకు ఇవ్వకూడదని 2024లో ఇచ్చిన కోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టం ప్రకారం 50శాతం పనులను కచ్చితంగా కూలీలతో చేయించాల్సి ఉందన్నారు. గ్రామ సభలు ఆమోదం పొందిన పనులు మాత్రమే చేయాలన్నారు. అందుకు విరుద్ధంగా కూటమి నేతలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని గ్రామసభల తీర్మానం లేకుండా కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తున్నారన్నారు. దీంతో తాము కోర్టుకెళ్లగా అలా ప్రైవేటు కాంట్రాక్టర్లకు కేటాయించిన పనులు రద్దు చేయాలని తీర్పు ఇచ్చిందన్నారు. ఉపాధి చట్టం అమలులో ప్రధాన భూమిక పోషిస్తున్న డ్వామా పీడీ, జెడ్పీ సీఈఓ, ఎంపీడీఓ, పీఓ, ఏపీఓలు, సంబంధిత జిల్లా అధికారులే జరుగుతున్న అవకతవకలకు బాధ్యత వహించాల్సి ఉందన్నారు. ఏఎస్‌పేట ఎంపీపీ పద్మజారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మందల వెంకటశేషయ్య, సర్పంచ్ అడపాల ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment