
అయ్యో కూలీలు.. ఆకలి కేకలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ‘ఉపాధి’కి గండి పడింది. కూలీలకు ఇప్పటికే రెండు నెలలుగా వేతనాలు జమకాకపోవడంతో ఆకలితో అలమటిస్తున్నారు. మార్చి ఆఖరి కావడంతో ఆలస్యమవుతుందంటూ అధికారులు బుకాయిస్తున్నారు. ఇప్పటికే కూటమి నేతలు బినామీ మస్తర్లతో అసలైన కూలీలకు పనులు కల్పించడంలేదు. గతంలో రోజుకు లక్షల మందికిపై పనిచేస్తే.. ఇప్పుడు ఆ కూలీల సంఖ్య సగానికి తగ్గిపోయింది.
నెల్లూరు(పొగతోట): ఉపాధి హామీ కూలీలకు రెండు నెలలుగా వేతనాలు అందలేదు. జనవరి నెలలో సంక్రాంతి పండగ తర్వాత నుంచి వారి బ్యాంక్ ఖాతాల్లో చిల్లిగవ్వ కూడా జమ కాలేదు. దీంతో ఉపాధి పనులకు హాజరయ్యే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. జిల్లాలో 4 లక్షలకు పైగా జాబ్‌కార్డులు కలిగిన కూలీలున్నారు. 37 మండలాల పరిధిలో గత ప్రభుత్వంలో నిత్యం 1.20 లక్షల నుంచి 1.40 లక్షల మంది వరకు పనులకు హాజరవుతుండేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయా పార్టీల నేతలు యంత్రాలు పెట్టి బినామీ మస్తర్లు వేసి పనులకు గండి కొట్టారు. దీంతో ప్రస్తుతం సుమారు 70 వేల నుంచి 80 వేల మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు.
గతంలో ఇలా..
గతంలో ఉపాధి కూలీలకు వారం వారం వారి బ్యాంక్ ఖాతాల్లో వేతనాలు జమయ్యేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం సిబ్బందిపై వేధింపులు, టీడీపీకి అనుకూల వర్గాల వారికే పనులు కల్పించాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో లక్ష్యం నీరుగారుతోంది. కూలీలకు పేమెంట్లు అందకపోవడం ఒక పరిస్థితి అయితే, అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో పనులు జరగాలంటూ ఆదేశాలివ్వడంతో పనులు కుంటుపడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ పాలనలో కూలీలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ప్రస్తుతం అటువంటి వాతావరణం లేదు. టీడీపీకి అనుకూలంగా ఉన్న వారికే పనులు కల్పిస్తున్నారు. బడ్జెట్ ఆఖరి నెలకు, ఉపాధి కూలీల వేతనాలకు ఏం సంబంధం అనే ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం లేదు. ఈ ఏడాదికి కేటాయించిన నిధులు ఏమయ్యాయో చెప్పడానికి సందేహిస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో పేమెంట్లు అందుతాయని అధికారులు అంటున్నారు. అయితే నమ్మకం లేదని కూలీలు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
రెండు నెలలుగా వేతనాలు పడక అవస్థలు
జిల్లా వ్యాప్తంగా రూ.22 కోట్లకు పైగా బకాయిలు
గతంలో వారానికొకసారి జమ చేస్తున్న పరిస్థితి
ఏప్రిల్ మొదటి వారంలో వస్తాయంటున్న
అధికారులు
పేమెంట్లు అందకపోవడంతో తగ్గుతున్న కూలీల
సంఖ్య