
రథం ఘటనలో కేసు నమోదుపై సందిగ్ధం?
బిట్రగుంట: కొండబిట్రగుంట బిలకూట క్షేత్రం రథోత్సవం అపశృతి వెనుక కుట్రకోణం ఉందంటూ ఆలయ ఈఓ రాధాకృష్ణ చేసిన ఫిర్యాదుపై సందిగ్ధత నెలకొంది. ఆలయ అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగా రథోత్సవం నిలిచిపోయిన విషయం తెలిసిందే. రథాన్ని ముందుగా పరిశీలించకుండా, ట్రయల్ రన్ నిర్వహించకుండా రథోత్సవం ప్రారంభించడంతో 20 అడుగులు కూడా ముందుకు కదలకముందే చక్రాల బేరింగ్ సిస్టంలో సమస్యలు తలెత్తి రథం ఆగిపోయింది. దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈఓకు, ఆయన సోదరుడికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, జిల్లా వ్యాప్తంగా భక్తుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడంతో దేవదాయశాఖ తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు కుట్ర కోణాన్ని తెర మీదకు తీసుకువచ్చింది. ఈ మేరకు ఈఓ రాధాకృష్ణ ఆదివారమే బిట్రగుంట పోలీస్‌స్టేషన్‌లో కుట్ర కోణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. సరైన ఆధారాలు లేకపోవడంతోపాటు భక్తులను అలజడికి గురిచేసే సున్నితమైన అంశం కావడంతో మంగళవారం సాయంత్రం వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఉన్నతాధికారుల అనుమతితో కేసు నమోదు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నారు. మరో వైపు ఈఓకు, ఆయన సోదరుడికి వ్యతిరేకంగా పాతబిట్రగుంట, కొండబిట్రగుంట గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈఓపైన, కొండపై తిష్టవేసిన అతని సోదరుడిపై దేవదాయశాఖ ఏసీకి ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించకపోతే శనివారం నుంచి కలెక్టరేట్ వద్ద నిరవధిక ధర్నా నిర్వహించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది.
31 వరకు
అఫిలియేషన్ల రెన్యూవల్
నెల్లూరు (టౌన్): 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రైవేట్ జూనియర్ కళాశాలల ప్రొవిజనల్ అఫిలియేషన్ రెన్యూవల్ గడువును ఈ నెల 31వ తేదీ వరకు గడువు పెంచినట్లు ఆర్‌ఐఓ ఆదూరు శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోర్సులు మార్పిడి, కొత్త కోర్సులు, అదనపు సెక్షన్లు మంజూరు, ద్వితీయ భాష, మీడియం మార్పు అనుమతి, ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కళాశాల తరలింపు, కళాశాల మూసివేత, మూసివేసిన కళాశాల పునః ప్రారంభం, కళాశాలల పేర్లు మార్పు తదితర వాటిని చేసుకోవచ్చన్నారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు నిర్ణీత గడువు లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఎంఈఓ వ్యవహారంపై డిప్యూటీ డీఈఓ విచారణ
● ఆయన్ను కాపాడే యోచనలో
అధికారులు
● విచారణకు వచ్చి ఎంఈఓ పెట్టిన
భోజనాన్ని ఆరగించి వెళ్లిన వైనం
ఉలవపాడు: ఉలవపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం, ఎంఈఓ శివనాగేశ్వరరావు మద్యం మత్తులో తూగుతున్న వైనంపై కందుకూరు డిప్యూటీ డీఈఓ పీపీ నరసింహారావు మంగళవారం విచారణ చేపట్టారు. సాక్షిలో మంగళవారం ‘మద్యం మత్తులో ఎంఈఓ’ శీర్షికన ప్రచురితమైన కథనానికి విద్యాశాఖ స్పందించింది. డిప్యూటీ డీఈఓ పాఠశాలకు వచ్చి శివనాగేశ్వరరావుతో మాట్లాడారు. ఆయన వివరణ, ఉపాధ్యాయుల వివరణ తీసుకున్నారు. విచారణ నివేదికను డీఈఓకు అందజేస్తామన్నారు. అయితే మరో ఎంఈఓ, ఉపాధ్యాయులు శివనాగేశ్వరరావుపై మద్యం తీసుకుంటాడని లిఖిత పూర్వకంగా ఇవ్వలేమని స్పష్టం చేసిన్నట్లు తెలిసింది. దీంతో డిప్యూటీ డీఈఓ కూడా సదరు ఎంఈఓను మందలించారని సమాచారం. మద్యం తాగుతున్నట్లు కచ్చితమైన ఆధారాలు ఉన్నా ఎంఈఓను కాపాడే పనిలో విద్యాశాఖ విచారణ జరిగిందని తెలుస్తోంది. విచారణకు వచ్చిన అధికారి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఈఓతో భోజనం తెప్పించుకుని అక్కడే తిని వెళ్లడం చూస్తే.. ఈ విచారణ ఎంత పారదర్శకంగా జరిగిందో అర్థమవుతుంది.

రథం ఘటనలో కేసు నమోదుపై సందిగ్ధం?
Comments
Please login to add a commentAdd a comment