
ఎస్పీఎల్ విజేత లయన్స్ జట్టు
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): సింహపురి ప్రీమియర్ లీగ్ టీ – 20 క్రికెట్ చాంపియన్‌గా నెల్లూరు రూరల్ లయన్స్ జట్టు నిలిచింది. బుజబుజనెల్లూరులోని సీఐఏ క్రీడా మైదానంలో హోరాహోరీగా సాగిన ఫైనల్స్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెల్లూరు రూరల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన గూడూరు రాయల్ చాలెంజర్స్ జట్టు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 196 పరుగులకే పరిమితమైంది. దీంతో నెల్లూరు రూరల్ లయన్స్ జట్టు విజేతగా నిలిచింది. జట్టులోని పూర్ణ బౌలింగ్‌లో, బ్యాటింగ్‌లో ఉత్తమ ప్రతిభ చూపి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నారు. విజేతలకు బహుమతులను ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అందజేశారు. కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, నెల్లూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కేర్‌టేకర్ శ్రీనివాసులురెడ్డి, సంయుక్త కార్యదర్శి మునిగిరీష్, సభ్యులు శ్రీనివాసులు, రాజశేఖర్‌రెడ్డి, నిర్వాహక కమిటీ చైర్మన్ వంశీకుమార్, నవాజ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
రుస్తుం మైన్
రికార్డుల పరిశీలన
పొదలకూరు: మండలంలోని రుస్తుం మైన్ రికార్డులను స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ డీఎస్పీ గిరిధర్‌రావు గురువారం పరిశీలించారు. మైన్‌కు సంబంధించిన సర్వే నంబర్లు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్రమ మైనింగ్‌కు సంబంధించిన కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని ఏ – 4గా చేర్చడం, ఎస్సీ, ఎస్టీ కేసును ఇంప్లీడ్ చేయడం తదితర పరిణామాల నేపథ్యంలో రికార్డుల పరిశీలన ప్రాధాన్యత సంతరించుకుంది. కేసు దర్యాప్తులో భాగంగానే రికార్డులను పోలీస్ అధికారులు పరిశీలించారని తెలుస్తోంది. తహసీల్దార్ శివకృష్ణయ్య వద్ద స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు.
మర్యాదపూర్వకంగా..
నెల్లూరు (లీగల్): జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్‌ను కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్ మర్యాదపూర్వకంగా గురువారం కలిశారు. కోర్టులోని ఆయన చాంబర్‌లో కలిసి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలను తెలియజేశారు.
ఇద్దరు పంచాయతీ
సెక్రటరీల సస్పెన్షన్
నెల్లూరు(పొగతోట): నిధుల దుర్వినియోగం తదితర అంశాల్లో అక్రమాలకు పాల్పడిన మనుబోలు మండలం వీరంపల్లి పంచాయతీ కార్యదర్శి ఆదిలక్ష్మి, బోగోలు మండలం నాగులవరం పంచాయతీ సెక్రటరీ భాస్కర్‌రావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను డీపీఓ శ్రీధర్‌రెడ్డి గురువారం జారీ చేశారు. గ్రామ పంచాయతీ పనుల నిమిత్తం వచ్చిన ప్రజల నుంచి నాగులవరం పంచాయతీ సెక్రటరీ నగదును డిమాండ్ చేయడం, వసూలు చేసిన ఇంటి పన్ను రూ.23593ను జమ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గానూ సస్పెన్షన్ వేటేశారు. వీరంపల్లి సెక్రటరీ పంచాయతీకి సంబంఽధించిన సాధారణ నిధులు రూ.1,04,650, 15వ ఆర్థిక సంఘ నిధులు రూ.ఐదు వేలను దుర్వినియోగం చేశారు. సాధారణ నిధుల నుంచి రూ.21,290, 15వ ఆర్థిక సంఘ నిధులు రూ.32990ను నిబంధనలు పాటించకుండా డ్రా చేయడంతో సస్పెండ్ చేశారు.
కిలో పొగాకు గరిష్ట
ధర రూ.280
మర్రిపాడు: డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో కిలో పొగాకుకు గరిష్టంగా రూ.280 ధర గురువారం పలికిందని వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. వేలానికి 760 బేళ్లు రాగా, 521 బేళ్లను కొనుగోలు చేశామని చెప్పారు. కిలో పొగాకు గరిష్టంగా రూ.280, కనిష్టంగా రూ.220, సగటున రూ.256.41 ధర పలికిందని వివరించారు. వేలంలో 11 కంపెనీలకు చెందిన వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు.

ఎస్పీఎల్ విజేత లయన్స్ జట్టు