నదిలోకి రోడ్డు | - | Sakshi
Sakshi News home page

నదిలోకి రోడ్డు

Published Fri, Apr 18 2025 12:04 AM | Last Updated on Fri, Apr 18 2025 12:04 AM

నదిలో

నదిలోకి రోడ్డు

ఇసుకాసురుల ధనదాహానికి పెన్నమ్మ విలవిల్లాడుతోంది. ఇచ్చిన అనుమతుల గడువు పూర్తయినా ఒకరు తవ్వకాలు సాగిస్తుండగా, సంగం బ్యారేజీకి అతి సమీపంలో ఇబ్బడిముబ్బడిగా మరొకరు తోడేస్తున్నారు. దీనిపై రైతులు ప్రశ్నిస్తే, భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వ పెద్దలు అక్రమ కేసులు బనాయిస్తారనే భయంతో వీరు మిన్నకుండిపోతున్నారు. డ్రెడ్జింగ్‌ పేరుతో యంత్రాలను వినియోగించి ఇష్టానుసారంగా కొల్లగొడుతున్నా, చోద్యం చూడటం అధికారుల వంతవుతోంది.

చెలరేగిపోతున్న

ఇసుకాసురులు

ఇష్టానుసారంగా తవ్వకాలు

డ్రెడ్జింగ్‌ పేరుతో యంత్రాలు

అనుమతుల్లేకపోయినా యథేచ్ఛగా..

బ్యారేజీకి సమీపంలోనూ దందా

చోద్యం చూస్తున్న అధికారులు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పెన్నా.. కడుపు కోతతో అల్లాడుతోంది. నది లోపలికి రోడ్డును నిర్మించి మరీ ఇసుకను తోడేస్తున్నారు. డ్రెడ్జింగ్‌కు కాంట్రాక్టర్లకు అనుమతిస్తే, యంత్రాలను వినియోగించి కొల్లగొట్టి సొమ్ము చేసుకుంటున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలం సూరాయపాళెం రీచ్‌లో నిబంధనలను పాటించే నాథుడే కరువయ్యారు.

ఇతర రాష్ట్రాలకు రవాణా

నాకింత, నీకింత అనే రీతిలో ఇసుకను తోడేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. మైనింగ్‌, ఇరిగేషన్‌ అధికారులు పట్టించుకోకపోవడం.. పర్యావరణ ముప్పు ఏర్పడటంతో పాటు బ్యారేజీ మనుగడ ప్రశ్నార్థకంగా మారనుందని చుట్టుపక్కల గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొల్లగొడుతూ..

పొదలకూరు మండలం సూరాయపాళెం పరిధిలోని పెన్నాలో డ్రెడ్జింగ్‌ ద్వారా ఇసుకను తోడుతున్నారు. వాస్తవానికి ఇక్కడి రెండు రీచ్‌లకు డ్రెడ్జింగ్‌ అనుమతులు జారీ చేశారు. దీని పేరుతో ఇష్టానుసారం కొల్లగొడుతూ పెద్ద లారీ లు, టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నా రు. నిబంధనలకు విరుద్ధంగా నది లోపలికి వెళ్లి డ్రెడ్జింగ్‌తో పాటు యంత్రాలను పెడుతున్నారు. ఒక రీచ్‌కు ఇచ్చిన అనుమతి గత నెల్లోనే ముగిసినా, తవ్వకాలు ఏ మాత్రం ఆగడంలేదు. మే నెలాఖరు వరకు పొడిగించారని అధికారులు చెప్తున్నారు. అనుమతులు పూర్తయిన సమయంలోనూ రాత్రివేళ నదీ గర్భంలోకి వెళ్లి మరీ తోడేశారు.

నిబంధనలు బేఖాతర్‌

సంగం ఆనకట్టకు దగ్గర్లోనే ఇసుకను తోడేయడంతో బ్యారేజీకి ప్రమాదం పొంచి ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నిబంధనల మేరకు బ్యారేజీకి 500 మీటర్ల దూరంలో ఇసుక తవ్వకాలు లేదా డ్రెడ్జింగ్‌ చేయాల్సి ఉంటుంది. అయితే 250 మీటర్లలోపే ప్రక్రియను యథేచ్ఛగా జరుపుతున్నారు. మరోవైపు నది ఒడ్డున ర్యాంప్‌ను ఏర్పాటు చేసి, పడవల ద్వారా ఇసుకను తీసుకొచ్చి బయట నిల్వ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఇలాంటివేవీ కానరావడంలేదు.

పర్యావరణానికి ముప్పు

ఇసుక అక్రమ తవ్వకాలతో పర్యావరణానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఇష్టానుసారంగా.. లోతుగా తోడేయడంతో చుట్టుపక్కల భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే పక్క గ్రామం విరువూరులో ఈ పరిస్థితి ఏర్పడింది. చెంతనే పెన్నా ఉన్నా బోర్లు వేస్తే సక్రమంగా నీరు పడటంలేదు. దీనికి తోడు రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన సంగం బ్యారేజీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. అతి సమీపంలో ఇసుక తవ్వకాలతో భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే ప్రమాదమూ లేకపోలేదు. కాగా పర్యావరణ ముప్పుపై ఇసుక కాంట్రాక్టర్లతో సూరాయపాళేనికి చెందిన కొందరు రైతులు ఇటీవల మాట్లాడారు. బ్యారేజీకి దూరంగా తవ్వకాలు చేసుకోవాలని, ఇలానే వ్యవహరిస్తే లారీలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.

టిప్పర్‌లో ఇసుకను లోడ్‌ చేస్తున్న యంత్రం

భారీ లారీలో ఇసుక తరలింపు

నదిలోకి అర కిలోమీటర్‌ మేర గ్రావెల్‌ రోడ్డును నిర్మించి భారీ యంత్రాలను దింపి ఇసుకను తవ్వుతున్నారు. రీచ్‌ల నుంచి నిత్యం సుమారు 600 టన్నులను తరలిస్తున్నారు. అయితే గత నెల వరకు ఐదు వేల టన్నులనే ఇక్కడి నుంచి తరలించారంటూ అధికారులు లెక్కలు చూపుతున్నారు. టన్నుకు రూ.250 వసూలు చేస్తూ, ప్రభుత్వానికి సీనరేజ్‌ ద్వారా రూ.78నే చెల్లిస్తున్నారు.

అనుమతులను పొడిగించాం

డ్రెడ్జింగ్‌ కాంట్రాక్ట్‌ పొందిన రీచ్‌ – 1 కాంట్రాక్టర్‌కు అనుమతులను మే వరకు పొడిగించాం. అక్రమ తవ్వకాలు జరిపితే ఉపేక్షించేది లేదు. ఆధారాలను సమర్పిస్తే చర్యలు చేపడతాం.

– రవికుమార్‌రెడ్డి, ఇరిగేషన్‌ ఇన్‌చార్జి డీఈ, పొదలకూరు

నదిలోకి రోడ్డు 1
1/2

నదిలోకి రోడ్డు

నదిలోకి రోడ్డు 2
2/2

నదిలోకి రోడ్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement