
పదిలో ఉత్తీర్ణతా శాతం ఢమాల్
ఐఐటీలో చేరడమే లక్ష్యం
జి. దీక్షిత ప్రియ ఏసీనగర్‌కు చెందిన తండ్రి గోపాల్, తల్లి ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు. పదో తరగతిలో 598 మార్కులు సాధించి జిల్లాలో ప్రఽథమ స్థానంలో నిలిచింది. ఐఐటీలో చదవాలన్నదే లక్ష్యంగా చెబుతుంది.
సివిల్స్ చేయాలని ఉంది
బీవీనగర్‌కు చెందిన సాయ చారిణి తండ్రి శివకుమార్ ప్రైవేట్ ఉద్యోగి. తల్లి వసంతకుమారి గృహిణి. కేఎన్నార్ స్కూల్‌లో 10వ తరగతి చదువుతుంది. పదిలో 596 మార్కులు సాధించింది. సివిల్‌కు ప్రిపేర్ అయి ఎంపిక కావాలన్నదే లక్ష్యంగా చెబుతుంది.
ఐఐటీ చేరుతాను
నెల్లూరు కేఎన్నార్ మున్సిపల్ స్కూల్ విద్యార్థిని కీర్తిపాటి హిమవర్షిణి తండ్రి వెంకటరాజు ప్రైవేట్ ఉద్యోగి. తల్లి విజయ గృహిణి. పది ఫలితాల్లో 594 మార్కులు సాధించింది. ఐఐటీలో చేరాలన్నదే లక్ష్యంగా చెబుతుంది.
● గతేడాది 88.17, ఈ ఏడాది 83.58
● రాష్ట్రంలో జిల్లాకు 13వ స్థానం
● ఫలితాల్లో బాలుర కంటే బాలికలే టాప్
● 28,275 మందికి 23,633 మంది ఉత్తీర్ణత
● జిల్లాలో అత్యధికంగా 598 మార్కులు
నెల్లూరు (టౌన్): పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో జిల్లాలో ఉత్తీర్ణతా శాతం పడిపోయింది. గత విద్యా సంవత్సరంలో 88.17 శాతం రాగా ఈ విద్యా సంవత్సరంలో 83.58 శాతం మాత్రమే 4.59 శాతం ఫలితాలు తగ్గాయి. రాష్ట్రంలో జిల్లాకు 13వ స్థానం దక్కింది. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 73.71 శాతం ఉత్తీర్ణత సాధించగా, ప్రైవేట్ పాఠశాలల్లో 94.65 శాతం ఉత్తీర్ణత సాధించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో విద్యకు పెద్ద పీట వేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్య, ఇంగ్లిష్ మీడియం, సరిపడా ఉపాధ్యాయులు, టోఫెల్ పరీక్ష విధానం తదితర వాటితో విద్యార్థులకు బోధన ఉండేది. టీడీపీ పాలనలో ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకున్న దాఖలాలు లేవు. విద్యార్థులకు సరిపడా సబ్జెక్ట్ టీచర్లు లేని పరిస్థితి ఉంది. పరీక్షలు కేవలం 3 నెలల ముందు జిల్లా వ్యాప్తంగా మొత్తం 500 మందికి పైగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేసిన పరిస్థితి. గతంలో ఇంగ్లిష్ మీడియంలోనే పరీక్ష నిర్వహించగా, ఈ విద్యా సంవత్సరం ఇంగ్లిష్ లేదా తెలుగు మీడియంలో పరీక్ష రాయొచ్చని ఆప్షన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు కొంత గందరగోళానికి గురైనట్లు చెబుతున్నారు.
బాలికలే టాప్
పదో తరగతి ఫలితాల్లో బాలికలు తమసత్తా చాటారు. పది పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా మొత్తం బాలురు 14,142, బాలికలు 14133 మంది కలిపి 28,275 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో బాలురు 11,510 మంది, బాలికలు 12,123 మంది కలిపి 23,633 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 81.39 శాతం, బాలికలు 85.78 శాతం ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతిలో జిల్లా వ్యాప్తంగా 83.58 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో ఫస్ట్ క్లాస్‌లో 19,745 మంది, సెకండ్ క్లాస్‌లో 2,622, థర్డ్ క్లాస్‌లో 1,266 మంది ఉత్తీర్ణులయ్యారు.
జిల్లాలో 598 మార్కులు అత్యధిక కటాఫ్
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లాలో అత్యధికంగా 600 మార్కులకు 598 మార్కులు సాధించి తమ సత్తా చాటారు. ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులే ప్రతిభ చాటారు. ప్రైవేట్ పాఠశాలల నుంచి గొల్ల దీక్షితప్రియ 598 మార్కులు, కాట్రగడ్డ కుందన వర్షిత 597, ఇనమురి తన్వి 597 కంచిబొట్ల సాయి బిల్వేష్ 597, పల్లంరెడ్డి ఇందుప్రియరెడ్డి 597, బండ్ల రోహన్ వరుణ్ 597, కోటపాటి జీతు 596, వాకా ప్రలేఖ్యారెడ్డి 596, షేక్ సుమైరా 596 మార్కులు సాధించారు. ప్రభుత్వ యాజమాన్యాల్లో భాగంగా కేఎన్నార్ మున్సిపల్ స్కూల్ విద్యార్థి సాయిచారణి 596, కృష్ణానగర్ జెడ్పీహెచ్ విద్యార్థి మల్లెల పూజిత 595, బీవీఎస్ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి కీర్తిపాటి హిమవర్షిణి 594, నవలాకులతోట జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థి మహమ్మద్ జువేరియా 594, బీవీఎస్ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి పోతురాజు జెస్సికా షారాన్ 593, కేఎన్నార్ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి దువ్వూరి సిగ్ధ్న 593, నవాబుపేట్ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి కండే సూర్య 593 మార్కులు సాధించారు.
జిల్లాలో 106 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత
జిల్లా వ్యాప్తంగా పదో తరగతి ఫలితాల్లో 106 పాఠశాలల్లో 100 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీటిల్లో ఏపీ మోడల్స్–2, ఏపీఆర్‌ఎస్–1 ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్–1, కేజీబీవీ–3, జిల్లా పరిషత్ –16, ప్రైవేట్ పాఠశాలు–83 ఉన్నాయి.

పదిలో ఉత్తీర్ణతా శాతం ఢమాల్

పదిలో ఉత్తీర్ణతా శాతం ఢమాల్

పదిలో ఉత్తీర్ణతా శాతం ఢమాల్