సాక్షి, అమరావతి: ఏపీలో మరో రూ.1425 కోట్ల పెట్టుబడులు సాకారం అవుతున్నాయి. పలు ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.క్రిబ్‌కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, విశ్వసముద్ర బయో ఎనర్జీ, సీసీఎల్ పుడ్ అండ్ బెవరేజెస్ పరిశ్రమలకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ సంస్ధను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, దాదాపుగా రూ.1425 కోట్ల పెట్టుబడితో 3 జిల్లాల్లో మంచి కార్యక్రమం జరుగుతుందని, దీని వల్ల దాదాపుగా 2500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ జిల్లాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. మూడు ప్లాంట్లకు శంకుస్ధాపన చేయడంతో పాటు ఒక ప్లాంట్‌ను ప్రారంభిస్తున్నాను. శంకుస్ధాపన చేసిన ప్లాంట్లన్నీ కూడా త్వరలో నిర్మాణం అవుతాయని ఆయన అన్నారు.
‘‘నెల్లూరులో క్రిబ్‌కో ఆధ్వర్యంలో దాదాపుగా రూ.610 కోట్ల పెట్టుబడితో ఇథనాల్ తయారీ ప్లాంట్ వస్తుంది. 12 నెలల్లోపే ఈ కర్మాగార నిర్మాణం పూర్తవుతుంది. 500 కిలోలీటర్ల ప్రొడక్షన్ కెపాసిటీతో బయో ఇథనాల్ ప్లాంట్ రెండు దశల్లో ప్లాంట్ పూర్తయితే 1000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఎలాంటి సహకారం కావాలన్నా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది’’ అని సీఎం అన్నారు.
‘‘ఒక్క ఫోన్ కాల్ దూరంలో మీకు అందుబాటులో ఉంటామన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొండి. ఇదే నెల్లూరు జిల్లాలో విశ్వసముద్ర బయో ఎనర్జీ ప్లాంట్ వస్తోంది. రోజుకు 200 కిలోలీటర్ల కెపాసిటీతో నెలకొల్పతున్న బయో ఇథనాల్ ప్లాంట్ ఇది. దీనివల్ల 500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు వస్తాయి. రూ.315 కోట్లతో వచ్చే ఈ ప్రాజెక్టు కూడా మరో 18 నెలల్లో అందుబాటులోకి వస్తుంది. చదువుకున్న మన పిల్లలకు ఈ ప్లాంట్ వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇది చాలా సంతోషకరమైన విషయం. ప్లాంట్ డైరెక్టర్ జితేంద్రతో పాటు యాజమాన్యానికి మనస్ఫూర్తిగా అభినందనలు’’ అని సీఎం పేర్కొన్నారు.
‘‘అదే విధంగా తిరుపతి జిల్లాలో కాంటినెంటిల్ కాఫీ కూడా ఫ్యాక్టరీ పెడుతోంది. రూ.400 కోట్ల పెట్టుబడితో..ఏటా 16వేల టన్నుల కెపాసిటీతో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 400 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఏలూరు జిల్లాలో గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ సంస్ధ ఏర్పాటు చేస్తుంది.రూ.100 కోట్ల పెట్టుబడితో 400 టన్నుల సామర్థంతో ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టు విస్తరణకు వెళ్తున్నారు. ప్లాంట్ ఏర్పాటుకు మన దగ్గరకు వచ్చిన తర్వాత అనుమతి ఇచ్చిన కేవలం 9 నెలల్లోనే యూనిట్‌ను ప్రారంభోత్సవం చేసుకోవడం అభినందనీయం’’ అని సీఎం పేర్కొన్నారు.
చదవండి: అంచనాలు నిజం కాబోతున్నాయి.. వైఎస్సార్‌సీపీ గెలుపు నల్లేరుపై నడకే..
‘‘ఇందుకు కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి అధికారికి అభినందనలు. ఈ యూనిట్ వల్ల కూడా మరో 500 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు. దాదాపుగా 2500 మందికి ఉద్యోగ అవకాశాలు.. రూ.1425 కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్ల ఏర్పాటు ద్వారా.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో మనం చేసుకున్న ఎంఓయూలు కార్యరూపం దాల్చుతున్న మంచి ఘడియలు ఇవి’’ అని సీఎం జగన్ అన్నారు.
సీఎం జగన్ చొరవతో పరిశ్రమలు: మంత్రి కాకాణి
బయో ఇథనాల్ ఎనర్జీ ప్లాంట్స్ శంకుస్థాపన అనంతరం మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. మనం ఎన్నో ఏళ్లుగా ఈ పరిశ్రమల కోసం ఎదురుచూస్తూ ఉన్నాము. ఈరోజు సీఎం వైఎస్ జగన్ గారి చొరవతో ఇక్కడ ఈ పరిశ్రమలకు శంకుస్థాపన చేసుకోగలిగాము. ఈ పరిశ్రమకు కావాల్సిన భూమిని సమకూర్చిన వారికి పరిహారం కూడా ఇచ్చాము. ఆ కుటుంబాలు ఆర్ధికంగా ఎదగడానికి పరిశ్రమ యాజమాన్యాలు సహకరించాలని ఈ సందర్బంగా వారిని కోరుతున్నాను.
రూ. 925 కోట్లతో నిర్మించనున్న ఈ రెండు బయో ఇథనాల్ ఎనర్జీ ప్లాంట్స్ పూర్తయితే స్థానికంగా ఉండే సుమారు 75 శాతం మంది యువతకు ఉపాధి కలుగుతుంది. క్రిబ్కో విశ్వ సముద్ర ప్రవేట్ లిమిటెడ్ అధ్వర్యంలో ఈ రెండు ప్లాంట్స్ ను కాలుష్యం లేకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుని నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment