హిందూపురం: ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తూ చెరువులో జారిపడి మృతి చెందారు. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. హిందూపురం రూరల్ సీఐ కృష్ణారెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పూలకుంటకు చెందిన ఐటీఐ విద్యార్థి చంద్రకీర్తి (18), కూలిపనులు చేసుకునే తరుణ్ (18) స్నేహితులు. వీరు శుక్రవారం ఉదయం బహిర్భూమికని స్థానిక చెరువు వద్దకు వెళ్లారు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.
చెరువు వద్దకెళ్లగా వారు కనిపించలేదు. చెరువు నీటిలో ఒక చెప్పు తేలియాడుతుండటంతో అందులో మునిగిపోయి ఉంటారన్న అనుమానించారు. స్థానికుల సహకారంతో చెరువులో వెదికినా జాడ కనిపించలేదు. సమాచారం అందుకున్న రూరల్ సీఐ పోలీసు సిబ్బందితో పూలకుంట చెరువు వద్దకు చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బందిని రప్పించి వారి సహకారంతో చెరువులో వెదికించి మృతదేహాలను వెలికితీశారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి ఉంటారని, ఈతరాకపోవడంతో నీటమునిగి మృతి చెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.
శ్రీవారి హుండీ కానుకల లెక్కింపు
కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులు హుండీ ద్వారా సమర్పించిన కానుకలను శుక్రవారం లెక్కించినట్లు ఈఓ పట్టెం గురుప్రసాద్, ఆలయ చైర్మన్ గోపాలకృష్ణ తెలిపారు. 72 రోజులకు గాను హుండీ కానుకల ద్వారా రూ.98,13,595 ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. గతంలో కంటె ఈసారి ఆదాయం ఎక్కువ వచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ చలపతి, పాలక మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.
‘డీజిల్’ టెండర్ల పరిశీలన
పుట్టపర్తి టౌన్: జిల్లాలోని ఆరు ఆర్టీసీ డిపోలకు డీజిల్ సరఫరా చేసేందుకు దాఖలైన టెండర్లను డీపీటీఓ మధుసూదన్ ఆధ్వర్యంలో శుక్రవారం పరిశీలించారు. మొత్తం 35 టెండర్లు దాఖలయ్యాయి. ఇందులో ఖాళీగా వేసిన టెండర్‌ను తిరస్కరించారు. మిగతా టెండర్లను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హత కలిగిన టెండర్లను ఖరారు చేస్తామని అధికారులు తెలిపారు.
అయితే తమకు కావలసిన వారికి టెండర్‌కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారని పలువురు టెండర్‌దారులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. అలాంటిదేమీ లేదని అధికారులు తోసిపుచ్చారు. నిబంధనల ప్రకారమే టెండర్‌ను ఖరారు చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో పరిశీలన కమిటీ సభ్యులు చీఫ్ మెకానికల్ ఇంజినీర్ మోహన్‌కుమార్, అకౌంట్ ఆఫీసర్ లక్ష్మీదేవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment