సత్యసాయి జయంతిలో గవర్నర్ అబ్దుల్ నజీర్
ప్రశాంతి నిలయం: మానవాళికి నిస్వార్థ సేవలు అందించి, ఆధ్యాత్మిక బోధనలతో సన్మార్గం వైపు పయనింపజేసిన చైతన్యస్ఫూర్తి సత్యసాయి అని గవర్నర్ అబ్దుల్ నజీర్ కొనియాడారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో శనివారం సత్యసాయి బాబా 99వ జయంతి సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరై మాట్లాడారు. మత సామరస్యాన్ని పాటిస్తూ మానవత్వమే అందరి మతమన్న సందేశంతో మానవాళిని ఏకం చేసేందుకు సత్యసాయి కృషి చేశారన్నారు. నేటి సమాజానికి ఆయన సేవా స్ఫూర్తి ఆదర్శనీయమన్నారు. ట్రస్ట్ చేపట్టిన కార్యక్రమాలు అభినందనీయమని తెలిపారు. సత్యసాయి శతజయంతిని పురస్కరించుకుని ‘సాయికల్పతరు’ పేరుతో చేపట్టిన కోటి మొక్కలు నాటే కార్యక్రమం ఎంతో గొప్పదన్నారు.
రాష్ట్రంలో 44 వేల ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న 33 లక్షల మంది విద్యార్థులకు పౌష్టికాహారంలో భాగంగా రాగి జావ అందించేందుకు సత్యసాయి ట్రస్ట్ సహకారం అందించడం అభినందనీయమన్నారు. సత్యసాయి మానవాళికి అందించిన సేవలకు గుర్తింపుగా గత ప్రభుత్వం పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. బాబా చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలు దేశంలోని మిగిలిన సేవా సంస్థలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు.
అనంతరం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘సత్యసాయి దివ్యాంగ్జన్’ పథకం ద్వారా దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలను గవర్నర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. సెంట్రల్ ట్రస్ట్ వార్షిక నివేదికను గవర్నర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. 99 కేజీల బర్త్‌డే కేక్‌ను కట్ చేసి భక్తులకు పంచిపెట్టారు. కార్యక్రమంలో మంత్రులు సత్యకుమార్, సవిత, హిందుపురం ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యేలు, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment