No Headline
అస్తవ్యస్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థ
రెండు నెలలుగా బియ్యంతోనే సరి
స్టోర్లలో కనిపించని కందిపప్పు, పంచదార
బహిరంగ మార్కెట్‌లో కొనలేకపోతున్న జనం
సాక్షి, పుట్టపర్తి: కూటమి సర్కార్ నిరుపేదలను నానా తిప్పలు పెడుతోంది. సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా అటకెక్కిస్తూ పస్తులు పెడుతోంది. ముఖ్యంగా నిరుపేదల కడుపు నింపే ప్రజా పంపిణీ వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది. గతంలో వైఎస్ జగన్ సర్కార్ కార్డుదారులకు బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, గోధుమపిండి పంపిణీ చేయగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంటి వద్దనే రేషన్ పంపిణీ చేసే వ్యవస్థకు స్వస్తి పలకాలని నిర్ణయించింది. అంతేకాకుండా వివిధ కారణాలతో కార్డుదారులకు పంచదార, గోధుమపిండి, కందిపప్పు పంపిణీ నిలిపివేసింది. రెండు నెలలుగా బియ్యంతోనే సరిపెడుతోంది. అది కూడా రేషన్ దుకాణం వద్దకు వెళ్లి తీసుకోవాల్సిన పరిస్థితి. బహిరంగ మార్కెట్‌లో నిత్యావసర ధరలు విపరీతంగా పెరగడంతో కందిపప్పు కొనలేకున్నామని పేదలు వాపోతున్నారు.
ఆదాయ మార్గాలపై కన్ను..
రేషన్ డీలర్‌షిప్ కోసం జిల్లాలోని తెలుగు తమ్ముళ్లు పోటీ పడుతున్నారు. పేదలకు ఇవ్వాల్సిన సరుకులు ఇవ్వకుండా బ్లాక్‌లో విక్రయించి ఆర్జించాలనే లక్ష్యంతో అడ్డదారులు తొక్కుతున్నారు. ఇందుకోసం ఎవరికి వారుగా ఎమ్మెల్యేల వద్ద లాబీయింగ్ చేస్తున్నారు. ఫలితంగా కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. తమ్ముళ్ల కుమ్ములాటలో ఒక్కో పంచాయతీలో కార్డుల ఆధారంగా రెండు నుంచి మూడు రేషన్ దుకాణాలు వెలిశాయి. దీంతో తమ కార్డు ఏ దుకాణం పరిధిలో ఉందో? ఏ దుకాణం వద్దకు వెళ్లాలో తెలియక నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారు.
బలవంతంగా తొలగింపు..
జిల్లా 5,62,784 కార్డులుండగా, వీరికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 1,367 రేషన్ దుకాణాలు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా నిరుపేదలకు ప్రతి నెలా నిత్యావసర సరుకులు అందజేసేది. అయితే కూటమి అధికారంలోకి రాగానే.. చాలా చోట్ల డీలర్లను తొలగించారు. కొత్తగా టీడీపీ మద్దతుదారులను డీలర్లుగా నియమించారు. వారు తమకిష్టమొచ్చిన సమయంలో, తమకు అనుకూలమున్న ప్రాంతంలో రేషన్ పంపిణీ చేస్తున్నారు. దీంతో రేషన్ సరుకులు తీసుకునేందుకు నిరుపేదలు పనులు మానుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గట్టిగా ప్రశ్నిస్తే అధికారంలో తమ పార్టీ ఉందని.. తమకు ఇష్టం వచ్చినప్పుడు రేషన్ సరుకులు పంపిణీ చేస్తామంటున్నారు. ఇంకా పాత డీలర్లే కొనసాగుతున్న చోట్ల నిత్యావసరాల పంపిణీని టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారు. ఫలితంగా నిరుపేదలను పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
కొనలేని పేదలు..
గతంలో చౌక దుకాణాల ద్వారా కార్డుదారులకు అరకిలో చక్కెర రూ.17.50కే ఇచ్చేవారు. కిలో కందిపప్పు రూ.67కే ఇచ్చేవారు. అయితే ప్రస్తుతం రేషన్ దుకాణాల్లో పంపిణీ చేయడం లేదు. బయట కొందామంటే రేట్లు విపరీతంగా ఉంటున్నాయని పేదలు వాపోతున్నారు. కిలో చక్కెర రూ.42 పైగా ఉంటోంది. కందిపప్పు కిలో రూ.185 పలుకుతోంది. దీంతో చాలామంది పేదలు కందిపప్పు కొని తినలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పంపిణీని రాజకీయం చేయడం మాని, నిరుపేదలందరికీ నిత్యాసర సరుకులు అందించాలని జనం వేడుకుంటున్నారు.
నిరుపేదలకు తక్కువ ధరకే నిత్యావసరాలు అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రజాపంపిణీ వ్యవస్థను కూటమి సర్కార్ అస్తవ్యస్తం చేసింది. కార్డుదారులకు రాయితీతో ఇవ్వాల్సిన కందిపప్పు, చక్కెరకు పూర్తిగా కోత పెట్టింది. కేవలం బియ్యం ఇస్తూ గంజి కాచుకుని తాగమంటోంది. ఇక కూటమి పార్టీల నేతలు రేషన్‌డీలర్లుగా తమ వారిని నియమించుకునేందుకు కొన్ని చోట్ల పాత డీలర్లు రేషన్ పంపిణీ చేయకుండా అడ్డుకుంటున్నారు. దీంతో బియ్యం కూడా అందని పరిస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment