సాక్షి, పుట్టపర్తి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సత్యసాయి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వరుసగా ఐదో ఏడాది రెండో విడతలో వైఎస్సార్ రైతు భరోసా నిధులను విడుదల చేశారు. పుట్టపర్తిలో బటన్ నొక్కి ఒక్కొక్కరికి రూ.4,000 చొప్పున 53.53 లక్షల మంది రైతన్నలకు రూ.2,204.77 కోట్ల రైతు భరోసా సాయం అందజేశారు.
ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘దేవుడి దయంతో మంచి కార్యక్రమం జరుగుతోంది. వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా రైతన్న ఖాతాల్లోకి డబ్బు జమ చేస్తున్నాం. రైతులు ఇబ్బందులు పడకూడదనే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా నిధులు ఇస్తోంది. పీఎం కిసాన్ నిధులు కూడా విడుదల చేయాలని కేంద్రాన్ని కోరాను. ఈనెలలోనే అవి కూడా వస్తాయి. ప్రతీ విషయంలో అన్నదాతలకు అండగా నిలబడ్డాం. మొత్తం రూ.33,209.81 కోట్లు సాయం అందించాం. 14 ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రైతులకు చేసిందేమీ లేదు. రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాలని గతంలో ఎప్పుడూ ఆలోచన చేయలేదు. రైతులకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబుకు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నాను.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను నాయకత్వంలోకి తీసుకొచ్చాం. నా నిరుపేద వర్గాలకు మంచి జరగాలనే అడుగులు వేశాం. ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలున్న గిరిజన రైతున్నలకు రైతు భరోసా అందించాం. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా?. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా చూడాలి. సామాజిక సాధికార యాత్రకు విశేష స్పందన వస్తోంది. బాబు హయాంలో వ్యవసాయానికి ఏడు గంటల కరెంట్ కూడా ఇవ్వలేకపోయారు. మీ బిడ్డ ప్రభుత్వంలో పుష్కలంగా వర్షాలు పడ్డాయి. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా?. ఈ నాలుగేళ్లలో రూ.7800 కోట్ల బీమా అందించాం. ఈ క్రాప్ ద్వారా ప్రతీ రైతుకు మంచి జరిగేలా చేస్తున్నాం. ప్రతీ గ్రామంలో నేడు ఆర్‌బీకే కేంద్రాలు పనిచేస్తున్నాయి.
గడచిన నాలుగేళ్ల కాలంలో రూ.60వేల కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేశాం. చంద్రబాబు హయాంలో వరుసగా ఐదేళ్లు కరువే. దేవుడి దయతో గత నాలుగేళ్లలో కరువు మాటేలేదు. మన ప్రభుత్వంలో పంట సీజన్‌లో నష్టం జరిగితే అదే సీజన్‌లో ఇన్‌పుట్ సబ్సిడీ అందిస్తున్నాం. సున్నా వడ్డీకి నిజమైన అర్థం చెప్తూ రైతన్నకి భరోసా కల్పిస్తున్నాం. గతంలో సున్నా వడ్డీ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం జరిగింది. చంద్రబాబు హయాంలో హెరిటేజ్ కంపెనీకి లాభాలు పెరిగాయి. రైతులకు ఎందుకు మంచి జరగలేదు’ అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment