ఎమ్మెల్యేలను కించపరిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు | Posts on social media denigrating MLAs | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేలను కించపరిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు

Published Fri, Mar 17 2023 6:24 AM | Last Updated on Sat, Mar 18 2023 1:02 PM

 Posts on social media denigrating MLAs - Sakshi

రాప్తాడు రూరల్‌: అధికార పార్టీ ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్‌ చేస్తున్న ముగ్గురు టీడీపీ కార్యకర్తలపై అనంతపురం రూరల్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. వివరాలను సీఐ విజయభాస్కర్‌గౌడ్‌ గురువారం వెల్లడించారు. అనంతపురం మండలం సోములదొడ్డి గ్రామానికి చెందిన చల్లా రాఘవేంద్రనాయుడు, సిండికేట్‌నగర్‌కు చెందిన బత్తల మంజునాథ్‌, కట్టా లోకేష్‌... టీడీపీలో క్రియాశీలక కార్యకర్తలుగా చెలామణి అవుతున్నారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డికి విరుద్ధంగా వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టేలా ఇటీవల టీడీపీ రాష్ట్ర కార్యాలయం వేదికగా సామాజిక మాధ్యమాల్లో పెట్టిన వివిధ పోస్టులను వీరు వైరల్‌ చేశారు.

దీనిపై నందమూరినగర్‌కు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఇర్ఫాన్‌బాషా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో చల్లా రాఘవేంద్రనాయుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. పార్టీలో చురుకుగా ఉన్న సోషల్‌ మీడియా కార్యకర్తలు, స్థానిక నాయకులు, కార్యకర్తల పేర్లు, ఫొటోలతో ఎమ్మెల్యేను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తూ సిద్ధం చేసిన పోస్టులు తమకు ‘టీంపోస్ట్‌’ అనే డీపీ ఉన్న మొబైల్‌ నంబరు ద్వారా అందాయని, వీటిని టీడీపీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు వైరల్‌ చేస్తూ వచ్చామని నిందితుడు అంగీకరించాడు. రాఘవేంద్ర నాయుడు తెలిపిన మేరకు అతనితోపాటు బత్తల మంజునాథ్‌, కట్టా లోకేష్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పోస్టులను వైరల్‌ చేస్తే శాంతిభద్రతల దృష్ట్యా వారిపై రౌడీషీట్లు ఓపెన్‌ చేస్తామని ఈ సందర్భంగా సీఐ విజయభాస్కర్‌గౌడ్‌ హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement