‘యువగళం’ దెబ్బతో : ఎడమొహం.. పెడమొహం | TDP Leaders Internal fight In Kadiri | Sakshi
Sakshi News home page

‘యువగళం’ దెబ్బతో : ఎడమొహం.. పెడమొహం

Published Tue, Mar 21 2023 1:28 AM | Last Updated on Tue, Mar 21 2023 12:32 PM

- - Sakshi

ఉనికి కోల్పోతున్న టీడీపీకి జవసత్వాలు తెచ్చేందుకు ఆ పార్టీ నేత లోకేష్‌ ‘యువగళం’ పేరుతో చేపట్టిన పాదయాత్ర అసలుకే మోసం తెస్తోంది. కదిరిలో ఉప్పునిప్పులా ఉన్న అత్తార్‌, కందికుంట మధ్య విభేదాలు ‘యువగళం’లో మరోసారి బయటపడ్డాయి. పాదయాత్రలో లోకేష్‌కు కుడి, ఎడమగా మెలుగుతున్న అత్తార్‌, కందికుంట బలనిరూపణకు సిద్ధమయ్యారు. పోటాపోటీ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుండగా...ఎటువెళ్తే ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియని తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు.

సాక్షి, పుట్టపర్తి: ‘యువగళం’ దెబ్బతో కదిరి నేతల తీరు మరోసారి బట్టబయలైంది. కదిరి టీడీపీ టికెట్‌ రేసులో ఉన్న అత్తార్‌, కందికుంట ‘చినబాబు’తో చేయికలిపి నడుస్తున్నా.. ఇద్దరి మధ్య స్పష్టంగా కనిపిస్తున్నాయి. లోకేష్‌ యువగళం పాదయాత్రలో అత్తార్‌ చాంద్‌బాషా, కందికుంట వెంకట ప్రసాద్‌ ఏకంగా బలనిరూపణకు సిద్ధమయ్యారు.

నోరు విప్పని లోకేశ్‌..
‘యువగళం’ పాదయాత్ర కదిరి నియోజకవర్గంలో నాలుగు రోజుల పాటు సాగింది. ఆరంభం నుంచి అత్తార్‌, కందికుంట ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం కదిరి పట్టణంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఉదయం కందికుంట ఆధ్వర్యంలో బీసీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అత్తార్‌ చాంద్‌ బాషా మధ్యాహ్నం మైనార్టీలతో మరో సమావేశం ఏర్పాటు చేశారు. ఒకే వేదికపై రెండు కార్యక్రమాలు ఎందుకంటూ అసహనం వ్యక్తం చేసిన లోకేష్‌... ఏమీ చేయలేని పరిస్థితుల్లో రెండు కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం.

తమ్ముళ్లదీ తలోదారి..
అత్తార్‌, కందికుంట వర్గాలు కూడా ‘యువగళం’లో తమ నిరసన గళం వినిపించాయి. అత్తార్‌కు పేరురాకుండా ఉండేందుకు కందికుంట వర్గం ప్రయత్నిస్తుండగా...కందికుంటకు మైలేజీ రాకుండా అత్తార్‌ వర్గం చేయాల్సిందంతా చేసింది. అతుకులబొంత టీడీపీని ఇద్దరు నాయకులు చేరోవైపు లాగుతుంటే... తమ్ముళ్లు ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో పడిపోయారు. ఈ క్రమంలోనే సోమవారం జరిగిన బీసీ, మైనార్టీ సభల్లో కనిపించేందుకు చాలా మంది జంకారు. కందికుంట ఆధ్వర్యంలో జరిగిన బీసీ ఆత్మీయ సభలో కనిపిస్తే అత్తార్‌ అగ్గిమీద గుగ్గిలమవుతాడు. పోనీ అత్తార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మైనార్టీ సభకు వెళ్దామంటే కందికుంటకు కోపమొస్తుంది. అందుకే తమ్ముళ్లంతా తలోదారి చూసుకున్నారు. లోలోన కత్తులు దూస్తూ పైకి మాత్రం కలిసి లోకేష్‌ వెంట నడుస్తున్న ఈ ఇద్దరు నేతల తీరుపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్‌ అవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement