స్రవంతికి దుస్తులు, పుస్తకాలు అందజేస్తున్న ఎస్పీ మాధవరెడ్డి - Sakshi
పుట్టపర్తి టౌన్: నల్లమాడకు చెందిన చిన్నారి స్రవంతికి ఎస్పీ మాధవరెడ్డి ఆర్థికంగా అండగా నిలిచారు. తల్లి మృత్యువాత పడటం, అనారోగ్యంతో తండ్రి మంచం పట్టడంతో కుటుంబ భారం మోస్తున్న స్రవంతి గురించి తెలుసుకున్న ఎస్పీ సోమవారం చిన్నారిని తన కార్యాలయానికి పిలిపించారు. ఈ సందర్భంగా దుస్తులు, నిత్యావసరాలతో పాటు రూ.30 వేల ఆర్థిక సాయం చేశారు. అలాగే చిన్నారి చదువుకు ఇబ్బంది లేకుండా గురుకుల పాఠశాలలో చేర్పిస్తామన్నారు.
భవిష్యత్‌లోనూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ.. నల్లమాడకు చెందిన లక్ష్మీదేవి, సూర్యనారాయణ దంపతులు కూలి పనులు చేసుకుంటూ ఒక్కగానొక్క కూతురు స్రవంతిని అల్లారుముద్దుగా పెంచుకున్నారన్నారు. అయితే మూడేళ్ల క్రితం సూర్యనారాయణ చెట్టుమీద నుంచి పడి వెన్నుముక దెబ్బతినడంతో మంచానికే పరిమితం కాగా, భార్య లక్ష్మీదేవి కూలీ పనులు చేస్తూ భర్తను, కుమార్తెను పోషించేదన్నారు.
అయితే ఆరు నెలల క్రితం లక్ష్మీదేవి అనారోగ్యంతో మృతి చెందగా, కుటుంబ భారం చిన్నారి స్రవంతిపై పడిందన్నారు. తండ్రిని చూసుకుంటూ ఇరుగుపొరుగు వారు ఇచ్చే సహాయంతో జీవనం కొనసాగిస్తోందన్నారు. చిన్నారి స్రవంతికి తమవంతు సాయం అందిస్తామన్నారు. మానవతావాదులూ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దాతలు ఎవరైనా సాయం చేయాలనుకుంటే పుట్టగొలుసుల స్రవంతి,
అకౌంట్ నంబర్ 91155144392, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ నల్లమాడ (ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్: ఏపీజీబీ 0001014)కు విరాళాలు పంపాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ వాసుదేవన్, సీఐలు రాజేంద్రనాథ్ యాదవ్, రాగిరి రామయ్య, బాలసుబ్రమణ్యం రెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment