చంద్రబాబుకు షాక్.. పార్టీ మారనున్న అనంతపురం కీలక నేతలు! | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు షాక్.. పార్టీ మారనున్న అనంతపురం కీలక నేతలు!

Published Sat, Dec 23 2023 4:30 AM | Last Updated on Sat, Dec 23 2023 12:56 PM

- - Sakshi

► హిందూపురంలో బీసీ వర్గానికి చెందిన ఓ నేత రెండు దశాబ్దాలుగా టీడీపీ జెండా మోస్తున్నారు. మైనార్టీ నేత అబ్దుల్‌ ఘని తర్వాతైనా తనకు అసెంబ్లీ సీటు ఇస్తారని ఆశించారు. కానీ అధిష్టానం బాలకృష్ణను తెరపైకి తెచ్చింది. దీంతో సదరు నేత పదేళ్లుగా బాలకృష్ణ పల్లకీ మోస్తూ వచ్చాడు. ‘ఎన్నాళ్లిలా’ అంటూ తన వర్గం నుంచే వ్యతిరేకత రావడంతో కండువా మార్చేందుకు సిద్ధమయ్యారు.

పుట్టపర్తికి చెందిన మరో బీసీ నాయకుడు కూడా దశాబ్దకాలంగా టీడీపీ జెండా మోస్తున్నాడు. అతని ద్వారా బీసీల ఓట్లకు గాలం వేస్తున్న అధిష్టానం.. అసెంబ్లీ సీటు మాత్రం ఇవ్వడం లేదు. పెత్తనమంతా ‘పల్లె’కు కట్టబెట్టగా...పల్లకీ మోతతో సదరు నేత అలసిపోయారు. త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుని అధిష్టానానికి బీసీల సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.

...ఇలా..ఇన్నాళ్లూ టీడీపీ జెండా మోసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. తమను జెండా కూలీలుగా చూస్తున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలనుకుంటున్నారు. బడుగు, బలహీన వర్గాలను అక్కున చేర్చుకుని, రాజ్యాధికారం కట్టబెడుతున్న పార్టీవైపు చూస్తున్నారు.

సాక్షి, పుట్టపర్తి: తెలుగుదేశం పార్టీలో దశాబ్దాల కాలంగా కొనసాగిన వారికి నేడు గుర్తింపు లేకుండా పోయింది. పార్టీ గెలుపు కోసం జెండా మోసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఓటు బ్యాంకుగా వాడుకోవడం టీడీపీ పెద్దలకు అలవాటైంది. బడుగులను జెండా మోసే కూలీలుగా చూస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే పలు రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కేవలం పెత్తదార్లకే ఆదిపత్యం ఇవ్వడంపై బడుగు, బలహీన వర్గాల తమ్ముళ్లంతా అసంతృప్తిగా ఉన్నారు. ఫలితంగా గ్రామ స్థాయిలో టీడీపీ ఖాళీ అయ్యింది. గత సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆ తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ వార్డు స్థాయి నుంచి టీడీపీ బొక్కబోర్లా పడిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఎన్నో ఏళ్లుగా పార్టీ వెంట నడిచిన వారు ఒక్కొక్కరుగా వీడిపోతున్నారు. అయినా ఆ పార్టీ పంథా మాత్రం మారడం లేదు.

పగ్గాలు ఒకరికి.. పెత్తనం మరొకరికి..
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పెత్తందార్లకే పెత్తనం కట్టబెట్టారు. ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో కూడా అంతా బడాబాబులకే పెద్దపీట వేస్తున్నారు. ఒకటి, రెండు చోట్ల పేరుకు బీసీలకు పగ్గాలు ఇచ్చినప్పటికీ... వారిని కూడా పరిటాల కుటుంబమే ఆడిస్తోంది. ప్రస్తుతం టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా బీకే పార్థసారథి ఉన్నప్పటికీ.. అన్ని నిర్ణయాల్లో పరిటాల సునీత నిర్ణయమే ఫైనల్‌ అవుతోంది. అధిష్టానం వద్ద బీకే చెల్లని కాసు కాగా..పరిటాల సునీతే హవా నడిపిస్తోంది. ఫలితంగా బీకే వెంట నడిచినా.. ఎలాంటి ప్రయోజనం ఉండబోదని చాలామంది ఆయన వర్గీయులు ఒక్కొక్కరూ దూరం అవుతున్నారు.

పేరు ఈరన్న.. పెత్తనం గుండుమల..
మడకశిర నియోజకవర్గం 2008 నుంచి ఎస్సీలకు రిజర్వు అయ్యింది. అయితే నియోజకవర్గంలో ఎస్సీ లకు టికెట్‌ ఇచ్చినా.. అక్కడంతా బడాబాబులదే పెత్తనం నడుస్తోంది. పేరుకు ఈరన్న ఉన్నా... నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు మాత్రం వ్యాపారవేత్త గుండుమల తిప్పేస్వామికి ఇచ్చారు. దీంతో ఎస్సీ సామాజిక వర్గీయులు టీడీపీ వెంట నడిచేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఈరన్నను 2019 తర్వాత నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా నియమించారు. అయితే ఆ తర్వాత గుండుమల తిప్పేస్వామి తనదైన శైలిలో అధిష్టానం వద్ద లాబీయింగ్‌ చేసుకుని పగ్గాలు తీసుకున్నారు. అప్పటి నుంచి ఈరన్నను అడుగడుగునా అవమానిస్తూ వస్తున్నారు. ఏదైనా పార్టీ సభ జరిగినా ఈరన్న పేరు కూడా ప్రస్తావించడం లేదు. దీంతో ఈరన్న వర్గమంతా గుండుమల తిప్పేస్వామితో పాటు పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉంది.

మైనార్టీలకు మొండిచెయ్యి..
నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంలో ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా 2009లో అబ్దుల్‌ ఘని టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. అయితే ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ రాజకీయ ప్రవేశం కోసం ఘనిని పక్కనబెట్టారు. పార్టీలో ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో విసుగుచెందిన ఆయన వైఎస్సార్‌ సీపీలో చేరారు. కదిరిలోనూ మైనార్టీ నేతలను టీడీపీ అవసరానికే వాడుకుంటోంది. వైఎస్సార్‌ సీపీ గుర్తుపై గెలిచిన అత్తార్‌ చాంద్‌బాషాకు లేనిపోని ఆశలు పెట్టి పచ్చకండువా కప్పేసింది. ఆ తర్వాత కూరలో కరివేపాకులా తీసిపడేసింది. ఇప్పుడు అక్కడ అంతా కందికుంట రాజ్యమే నడుస్తోంది. కందికుంటకే టీడీపీ సీటు ఇస్తామని ఇటీవల కదిరిలో పర్యటించిన చంద్రబాబు చెప్పకనే చెప్పారు. పక్కనే ఉన్న అత్తార్‌ ఆశలన్నీ అడియాసలు కాగా, మైనార్టీలంతా తమను మోసం చేసిన బాబుకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు.

బీసీ కార్డుతో మోసం..
టీడీపీ బీసీల పార్టీ అని చంద్రబాబు పదేపదే చెబుతుంటారు.. కానీ ఆ దిశగా న్యాయం చేయడం లేదని పుట్టపర్తి నియోజకవర్గంలోని చాలా మంది బీసీ నాయకులు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుని.. పెత్తందార్లకే మద్దతు పలకడం చంద్రబాబు నైజమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెనుకొండలో ఏకంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథిని కాదని కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్న సవితమ్మకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ధర్మవరం, రాప్తాడులో పరిటాల కుటుంబ సభ్యులు ఇన్‌చార్జ్‌లుగా ఉన్నారు. హిందూపురంలో నందమూరి బాలకృష్ణ, పుట్టపర్తిలో పల్లె రఘునాథరెడ్డి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ఇలా ఎక్కడైనా టీడీపీలో పెత్తందార్ల పెత్తనమే సాగుతోంది. దీంతో దశాబ్దాలుగా పచ్చ నేతల పల్లకీ మోసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలంతా కండువా మార్చే పనిలో పడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement