
లైనింగ్‌తో రైతులకు తీరని అన్యాయం
ఆత్మకూరు: ‘హంద్రీ–నీవాలో లైనింగ్ చేస్తే జిల్లా రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఈ రోజు మనం మౌనంగా ఉంటే.. భవిష్యత్తులో మన పిల్లలకు తీరని అన్యాయం చేసిన వారవుతాం’ అని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆత్మకూరు మండలంలోని సింగంపల్లి, వై.కొత్తపల్లి, పంపనూరు, తలుపూరు గ్రామాల్లో రచ్చకట్టల వద్ద సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ హంద్రీ–నీవా కాలువలో ప్లాస్టింగ్ చేస్తే చుక్క నీరు కూడా భూమి లోపలికి ఇంకదనే విషయం సీఎం చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. రాప్తాడు నియోజకవర్గంలో హంద్రీ–నీవా కాలువ దాదాపు వంద కిలోమీటర్ల మేర పారుతోందని, లైనింగ్ పనులతో 1.50 లక్షల ఎకరాల ఆయకట్టు రైతులు దెబ్బతింటారన్నారు. కుప్పానికి నీరు తీసుకెళ్లాలన్న తొందరలో లైనింగ్‌కు తెరలేపా రన్నారు. ఇప్పటికీ శ్రీశైలంలో 80 టీఎంసీల నీరు ఉన్నాయని, మరో ఐదు నెలలు హంద్రీ–నీవా కాలువలో నీరు పారించే అవకాశమున్నా, నీటిని ఆపి మరీ పనులు చేయాలనుకోవడం దౌర్భాగ్యమన్నారు. జీడిపల్లి వరకు హంద్రీ– నీవా కాలువను మొదటి దశలో వెడల్పు చేస్తున్నారని, అక్కడి దాకా వెడల్పు చేస్తూ మనకు వచ్చే సరికి మాత్రం ఎందుకు లైనింగ్ చేస్తున్నారని ప్రశ్నించారు. ఓ టీడీపీ నాయకుడే ఇటీవల ప్రభుత్వ తీరుపై వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేశాడని, దీన్ని బట్టి పరిస్థితి ఎంత ఘోరంగా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చన్నారు. ముందు పేరూరు డ్యాంకు నీరు వదలాలని డిమాండ్ చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగనన్న కుప్పానికి నీటిని తరలించేందుకు అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు శ్రీకారం చుట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పట్లోనే చిత్తూరు జిల్లాలోని హంద్రీ–నీవా కాలువకు లింక్ కాలువ ఏర్పాటు చేశారని, రూ.3 వేల కోట్ల పనుల్లో దాదాపు రూ.1,500 కోట్ల పనులు పూర్తయినట్లు వెల్లడించారు. ఆ పనులు చేపట్టకుండా లైనింగ్ చేస్తామనడం అన్యాయమన్నారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీత నోరు మెదపకపోవడం దుర్మార్గమన్నారు.
వైఎస్సార్ చలువతోనే నీరు..
హంద్రీ–నీవా కాలువ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుణ్యమేనని, ఆయన చలువతో రైతులు తమ పొలాల్లో బోర్లు వేయించుకొని, పంటలు పండించుకుంటున్నారని ప్రకాష్ రెడ్డి తెలిపారు. మహానేత ఆశయాన్ని నీరు గార్చేలా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వంపై పార్టీలకతీతంగా నేడు ఉద్యమిస్తున్నారన్నారు. రైతులను కాదని లైనింగ్ పనులు చేస్తే అందరం కలసి అడ్డుకుంటామని, అందులో తాను ముందుంటానని హెచ్చరించారు. తన పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టుకు వెళ్లామని, త్వరలోనే యాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
సర్కారుపై పార్టీలకతీతంగా తిరుగుబాటు
ఎమ్మెల్యే పరిటాల సునీత
నోరుమెదపకపోవడం అన్యాయం
మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment