
అడిగినంత ఇస్తేనే రిజిస్ట్రేషన్
హిందూపురం అర్బన్: జిల్లాలో తొమ్మిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుండగా... ప్రతి కార్యాలయంలోనూ పదుల సంఖ్యలో డాక్యుమెంట్ రైటర్లు కనిస్తారు. ఆస్తి కొనుగోలు చేసినా, విక్రయించినా... డాక్యుమెంట్ రైటర్ లేనిదే ఫైలు ముందుకు కదలని పరిస్థితి. ప్రభుత్వానికి చలానా రూపంలో అందే మొత్తం కంటే డాక్యుమెంట్ రైటర్లు వసూలు చేసేదే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
డాక్యుమెంట్ రైటర్లదే రాజ్యం
ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ శాఖనే ప్రధాన ఆదాయ వనరు. అందువల్లే ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పని వేళల్లోనూ కాస్త వెసులుబాటు కల్పించింది. ఆన్‌లైన్ ద్వారా చలానా తీసి ప్రజలు నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. కానీ జిల్లాలో ఎక్కడా ఈ విధానం అమలు కావడం లేదు. ప్రజలు నేరుగా అన్ని డాక్యుమెంట్లు సమర్పించి ఆన్‌లైన్‌లో చలానా తీసినా ఆస్తి రిజిస్ట్రేషన్ పూర్తి కాదు. ఎందుకంటే కార్యాలయంలో తిష్టవేసిన డాక్యుమెంట్ రైటర్లు ఆయా డాక్యుమెంట్లకు అధికారులతో కొర్రీలు పెట్టిస్తున్నారు. నేరుగా డాక్యుమెంట్ రైటర్లను కలిస్తే మాత్రం కేవలం సంతకం చేస్తే చాలు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఇందుకోసం చలానాకు అదనంగా భారీగా వసూళ్లు చేస్తారు. ఇందులో అధికారుల వాటా కూడా ఉంటుందని తెలుస్తోంది.
లెక్కగట్టి రూకలిస్తారు
ఆస్తి రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ప్రభుత్వానికి చెల్లించే రుసుంతో పాటు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి ఇవ్వాల్సిన మొత్తం, డాక్యుమెంట్ రైటర్ వాటా.. కలిపి క్రయ విక్రయ దారులనుంచి వసూలు చేస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్ల వ్యవస్థ పోయినా... ఇంకా వారి హవానే కార్యాలయాల్లో సాగుతోంది. మొత్తం కార్యాలయాల్లో వారే అన్నీ చక్కబెడుతూ.. సాయంత్రానికి ఎన్ని డాక్యుమెంట్లు రిజిస్టరయ్యాయో లెక్కగట్టి ఎవరి వాటా వారికి పంచుతున్నట్లు తెలుస్తోంది.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ‘ప్రైవేటు’ సైన్యం
డాక్యుమెంట్ రైటర్లతో అధికారుల కుమ్మక్కు
క్రయవిక్రయ దారుల నుంచి ఇష్టానుసారం వసూళ్లు
ప్రశ్నిస్తే రిజిస్ట్రేషన్ చేయకుండా కొర్రీలు
హిందూపురం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంపై ఏటా ఏసీబీ (అవినీతి నిరోధకశాఖ) దాడులు జరుగుతాయి. ప్రజల నుంచి వసూళ్లు చేసే ప్రైవేటు వ్యక్తులతో పాటు అధికారులూ పట్టుబడతారు. ఆ తర్వాత పైరవీలు చేసుకుని మళ్లీ కార్యాలయంలో కొలువుదీరతారు. ఇలా.. మూడేళ్ల కాలంలో రెండుసార్లు ప్రైవేట్ వ్యక్తులు, అధికారులు పట్టుబడినా.. మళ్లీ ఇక్కడ షరా మామూలే అన్నట్లు వసూళ్ల రాజ్యం నడుస్తోంది.
చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ వెంకటరమణ, మరో ఉద్యోగి తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయడం, అవి వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు నెల క్రితం వారిని సస్పెండ్ చేశారు. తప్పుడు రిజిస్ట్రేషన్ తతంగం వెనుక డాక్యుమెంట్ రైటర్లు ఉన్నట్లు తేలింది. తాజాగా కొత్తగా వచ్చిన అధికారులను డాక్యుమెంట్ రైటర్లు మచ్చిక చేసుకుని దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
గత ఏడాది బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేయగా సబ్ రిజిస్ట్రార్‌తో సహా సిబ్బంది అవినీతి వెలుగు చూసింది. సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసనాయక్ ఏసీబీ అధికారుల నుంచి తప్పించుకుని పరారై ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో డాక్యుమెంట్ రైటర్ శ్రీహరిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
హిందూపురంలోని లక్ష్మీపురంలో 1,500 చదరపు అడుగుల స్థలం విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.30 లక్షలు. ప్రభుత్వం నిర్ణయించిన విలువ ప్రస్తుతం రూ.14.85 లక్షలు. ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయాలంటే ప్రభుత్వం నిర్ణయించిన విలువ మేరకు 7.5 శాతం చలానా తీయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆఫీసు ఫీజు, రైటర్ ఫీజు అదనం. వ్యక్తులను బట్టి, ప్రాంతాన్ని బట్టి ఇళ్లు, కమర్షియల్ సైట్లకు ఈ మొత్తం మారుతుంటుంది. ఎంతలేదన్నా ఒక్కో డాక్యుమెంట్‌కు చలానా కాకుండా అదనంగా కనీసంగా రూ.5 వేలపైనే డాక్యుమెంట్ రైటర్లకు ముట్టజెప్పాల్సి వస్తోందని జనం వాపోతున్నారు.

అడిగినంత ఇస్తేనే రిజిస్ట్రేషన్
Comments
Please login to add a commentAdd a comment