ఎండుమిర్చి @ 14,500
హిందూపురం అర్బన్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం క్వింటా ఎండుమిర్చి గరిష్టంగా రూ.14,500 పలికింది. మార్కెట్‌కు 106.60 క్వింటాళ్ల ఎండుమిర్చి రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలం పాట నిర్వహించారు. ఇందులో మొదటి రకం మిర్చి క్వింటాకు గరిష్టంగా రూ.14,500, కనిష్టంగా రూ.8 వేలు, సగటున రూ.11 వేలు ప్రకారం ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. గత వారం క్వింటా గరిష్టంగా రూ.11 వేలు పలుకగా ఈ వారం 3,500 అధికంగా పలకడం విశేషం.
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
పుట్టపర్తి టౌన్: ఇంటర్ వార్షిక పరీక్షలు శనివారం ప్రారంభం కానున్నాయి. తొలిరోజు మొదటి సంవత్సరం, 3వ తేదీ నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ నెల 20 నాటికి ముగుస్తాయి. రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. జిల్లా నుంచి మొదటి సంవత్సరం విద్యార్థులు 13,083 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 10,904 మంది మొత్తం 23,987 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరికోసం జిల్లా వ్యాప్తంగా 42 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రత్న తెలిపారు. కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబోమన్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు, సెల్‌ఫోన్ దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు.
బాధిత కుటుంబానికి
రూ.5 లక్షల పరిహారం
● ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశాలతో
దిగివచ్చిన విద్యుత్ శాఖ
మడకశిర: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిపై విద్యుత్‌తీగ తెగిపడి మృతి చెందగా.. బాధిత కుటుంబానికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశాలతో రూ.5 లక్షల పరిహారం దక్కింది. వివరాల్లోకి వెలితే... 2024 జూలై 27న మడకశిరకు చెందిన పెన్న ఓబిలేసు(39) వ్యక్తిగత పనిపై ద్విచక్రవాహనంలో ఇంటి నుంచి బయలుదేరాడు. యాదవ కల్యాణ మండపం వద్దకు చేరుకోగానే 11 కేవీ లైన్ విద్యుత్ తీగలు తెగి పెన్న ఓబిలేసుపై పడ్డాయి. విద్యుదాఘాతానికి గురైన పెన్న ఓబిలేసు అక్కడికక్కడే మృతి చెందారు. పెన్న ఓబిలేసు మృతితో ఆ కుటుంబం ఆర్థిక అండ కోల్పోయింది. ఆదుకోవాలని బాధిత కుటుంబీకులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా విద్యుత్ శాఖ స్పందించలేదు. దీంతో పెన్న ఓబిలేసు కుటుంబీకులు న్యాయం కోసం జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)ని ఆశ్రయించారు. స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందించాలని గురువారం విద్యుత్ శాఖను ఆదేశించింది. దీంతో విద్యుత్‌శాఖ శుక్రవారం మృతుడి భార్య ఖాతాలో రూ.5 లక్షలు జమ చేసింది. తమ కుటుంబానికి నష్ట పరిహారం అందే విధంగా కృషి చేసిన ప్రతి ఒక్కరికీ మృతుని భార్య కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment