సాంకేతికత నేర్పించడమే జీవాగ్రో ముఖ్య ఉద్దేశం
బత్తలపల్లి: మహిళా రైతులకు విలువ ఆధారిత సాంకేతికతను నేర్పించడమే జీవాగ్రో ముఖ్య ఉద్దేశమని డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ కేఎన్.నరసయ్య పేర్కొన్నారు. మంగళవారం స్థానిక మండల సమాఖ్య కార్యాలయంలో గ్రాంట్ థార్న్‌టన్ ఆధ్వర్యంలో జీవాగ్రో ప్రాజెక్టులో భాగంగా సామూహిక సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా డీఆర్‌డీఏ పీడీతో పాటు జీవాగ్రో ప్రాజెక్టు అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ కుళ్లాయప్ప, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సుధారాణి, జిల్లా హార్టికల్చర్ అధికారి చంద్రశేఖర్, డాట్ టీసీ నుంచి డాక్టర్ రామసుబ్బయ్య, సీఎస్‌ఏ ఆదినారాయణ, గ్రాంట్ థార్న్‌టన్ రామాంజులు, రాధ, హరిబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడాదిన్నరగా అనంతపురం రూరల్, ముదిగుబ్బ, బత్తలపల్లి ప్రాంతాల్లో గ్రాంట్ థార్న్‌టన్ అమలులో ఉందని, పండ్ల తోటల పెంపకంపై మహిళా రైతులు దృష్టి సారించేలా చేయడం, వారికి సుస్థిరమైన వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడం, మార్కెటింగ్ పరంగా వారికి సహాయపడటం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో ఏరియా కోఆర్డినేటర్ సత్యనారాయణ, ఏపీఎం సుదర్శన్‌రాజు, హరిప్రసాద్, శోభా, సీసీలు, బత్తలపల్లి ఎఫ్‌పీఓ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ తదితరులు పాల్గొన్నారు
నిలకడగా ఎండుమిర్చి ధర
హిందూపురం అర్బన్: ఎండమిర్చి ధర నిలకడగా కొనసాగుతోంది. మంగళవారం స్థానిక వ్యవసాయ మార్కెట్‌కు మంగళవారం 120.05 క్వింటాళ్ల ఎండుమిర్చి రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలం పాట నిర్వహించారు. ఇందులో క్వింటా ఎండుమిర్చి గరిష్టంగా రూ.15 వేలు, కనిష్టంగా రూ.7 వేలు, సరాసరిన రూ.13,500 ప్రకారం ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు.
ధర్మవరం–మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ పాక్షికంగా రద్దు
గుంతకల్లు: డివిజన్ పరిధిలోని ధర్మవరం రైల్వే జంక్షన్‌లో 5వ నంబర్ ప్లాట్‌ఫారం ఏర్పాటు పనుల్లో భాగంగా ధర్మవరం–మచిలీపట్నం మధ్య తిరుగుతున్న ఎక్స్‌ప్రెస్ రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ మంగళవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. అనంతపురం–మచిలీపట్నం మధ్య మాత్రమే నడుస్తున్నట్లు వెల్లడించారు. మచిలీపట్నం–ధర్మవరం (17215) ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 12 నుంచి 30 వరకు, ధర్మవరం–మచిలీపట్నం (17216) ఎక్స్‌ప్రెస్‌ను 13 నుంచి 31 వరకు పాక్షికంగా రద్దు చేసినట్లు వివరించారు. ప్రయాణికులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
సాంకేతికత నేర్పించడమే జీవాగ్రో ముఖ్య ఉద్దేశం
Comments
Please login to add a commentAdd a comment