వివాహిత అనుమానాస్పద మృతి
● అల్లుడే కారణమని మృతురాలి
తల్లి ఫిర్యాదు
ధర్మవరం అర్బన్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ధర్మవరం వన్‌టౌన్ పోలీసులు తెలిపిన మేరకు... పట్టణంలోని నేసేపేటకు చెందిన లక్ష్మీపతి భార్య నీరుగంటి అఖిల(21) ఓ పైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. రెండేళ్ల క్రితం వివాహమైన వీరి సంసారం కొంత కాలం సజావుగానే సాగింది. ఆ తర్వాత మనస్పర్థలు చోటు చేసుకుని తరచూ గొడవపడేవారు. ఈ క్రమంలో మంగళవారం ఇంట్లోనే ఉరి వేసుకుని అఖిల ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు అక్కడకు చేరుకుని బోరున విలపించారు. అల్లుడు లక్ష్మీపతి, ఆయన కుటుంబ సభ్యుల వేధింపులే తమ కుమార్తె మృతికి కారణమంటూ మృతురాలి తల్లి కళావతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. లక్ష్మీపతిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
విద్యార్ధిని బలవన్మరణం
సోమందేపల్లి: స్థానిక పాతూరులో నివాసముంటున్న ఈడిగ సురేష్ కుమార్తె పూజిత (15) ఆత్మహత్య చేసుకుంది. కేజీబీవీలో పదో తరగతి చదువుతున్న పూజిత... తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని నోట్ రాసి మంగళవారం సాయంత్రం ఇంట్లోనే పైకప్పునకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. బాలిక మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
‘క్లస్టర్ సమావేశాన్ని
రద్దు చేయాలి’
పుట్టపర్తి రూరల్: పదో తరగతి, ఇంటర్, ఓపెన్ స్కూల్ పరీక్షల నేపథ్యంలో బుధవారం నిర్వహించనున్న పాఠశాల క్లస్టర్ సమావేశాన్ని రద్దు చేయాలని ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర ఉపాధ్యక్షుడు విశ్వనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పదో తరగతి విద్యార్థులకు గ్రాండ్ టెస్ట్‌లు జరుగుతున్నాయని, చాలామంది టీచర్లు ఇంటర్, ఓపెన్ స్కూల్ పరీక్షల విధుల్లో ఉన్నారన్నారు. ఈ పరిస్థితులో ఈ నెల జరగాల్సిన పాఠశాల క్లస్టర్ సమావేశాన్ని రద్దు చేయడం ఉత్తమమన్నారు. ఈ అంశంలో ఒంటెద్దు పోకడలకు పోకూడదని ప్రభుత్వానికి సూచించారు.
ఆకట్టుకున్న కర్రసాము
పెద్దవడుగూరు(యాడికి): మండల కేంద్రమైన యాడికి చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన కర్రసాము పోటీలు ఉత్సాహంగా సాగాయి. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన యువకులు పోటీ పడగా, యాడికి గ్రామానికి చెందిన నాగార్జున ప్రథమ, శివకుమార్ ద్వితీయ, మహేష్ తృతీయ స్థానాన్ని దక్కించుకున్నారు. విజేతలను అభినందిస్తూ నిర్వాహకులు నగదు పురస్కారాలతో సత్కరించారు.
వివాహిత అనుమానాస్పద మృతి
Comments
Please login to add a commentAdd a comment