‘మామిడి తోటల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి’
అనంతపురం అగ్రికల్చర్: మామిడి తోటలు పిందె దశలో ఉన్నందున మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు వస్తాయని ఉద్యానశాఖ ఉమ్మడి జిల్లా అధికారులు జి.చంద్రశేఖర్, బీఎంవీ నరసింహారావు తెలిపారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల పిందె రాలడం, బంక కారడం, నల్లతామర, రసంపీల్చు పురుగులు, తేనె మంచు పురుగు ఆశించి నష్టం కలిగించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం వారం లేదా ఐదు రోజులకోసారి నీటి తడులు ఇవ్వాలన్నారు. రసంపీల్చుపురుగు జాతికి చెందిన నల్లతామరను సకాలంలో నివారించుకుంటే మంచి దిగుబడులు వస్తాయన్నారు. నివారణలో భాగంగా తోటలో కలుపు లేకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు. ఎకరాకు 40 నుంచి 50 నీలి లేదా తెలుపు రంగు జిగురు అట్టలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. పూత ప్రారంభ దశ నుంచి మొదట వేప సంబంధిత మందులు పిచికారీ చేయాలన్నారు. అందులో 2 మి.లీ అజాడిరక్టిన్ ( పది వేల పీపీఎం) లేదంటే 3 మి.లీ 1,500 పీపీఎం లేదా 3 వేల పీపీఎం ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. అలాగే 7.5 గ్రాములు పొంగానియా లేదా నీమ్ సోప్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. అలాగే 5 గ్రాములు బవేరియా బాసియానా లేదా లేకానిసిల్లియం లేకాని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. వీటన్నింటికీ నల్లతామర అదుపులోకి రాకపోతే చివరగా 2 మి.లీ పిప్రొనిల్ లేదా 0.3 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ లేదా 0.3 గ్రాములు థయామిథాక్సామ్ లేదా 1 మి.లీ స్పైరోటేట్రామెట్ లేదా 1 మి.లీ స్పైనోటోరం లేదా 1 మి.లీ ఫ్లూక్సా మెటామైడ్ మందులు మార్చి మార్చి రెండు మూడు దఫాలుగా పిచికారీ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment