సాయం చేసేందుకు వెళితే దగా చేశారు!
బత్తలపల్లి: ద్విచక్ర వాహనంపై నుంచి అదుపు తప్పి కిందపడుతున్న యువకుడికి సాయం చేసేందుకు వెళ్లిన వ్యక్తి సెల్‌ఫోన్‌ను చాకచక్యంగా అపహరించడమే కాక, ఆ సెల్‌ఫోన్‌లోని యూపీఐ బదలాయింపుల ద్వారా రూ.1.82 లక్షలను కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన మేరకు... బత్తలపల్లిలోని ధర్మవరం మార్గంలో శనివారం ఉదయం రాజారెడ్డి ఎలక్ట్రికల్ షాపు వద్ద ముళ్లగూరు అయ్యప్ప నిల్చొని ఉండగా... ధర్మవరం వైపు నుంచి ద్విచక్రవాహనంపై వచ్చిన ఓ యువకుడు బండి స్కిడ్ అవుతున్నట్లు నటించి, అక్కడే ఉన్న అయ్యప్పను సాయం కోరాడు. దీంతో అయ్యప్ప ద్విచక్ర వాహనాన్ని ఎత్తే ప్రయత్నం చేస్తుండగా మరో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు చాకచక్యంగా అయ్యప్ప చొక్కాలోని సెల్‌ఫోన్‌ను అపహరించారు. అయితే తన సెల్‌ఫోన్ పోయిన విషయం ఆలస్యంగా గుర్తించిన అయ్యప్ప దాని గురించి రెండు రోజులుగా ఆరా తీశాడు. ఫలితం దక్కలేదు. ఈ లోపు ఆయన కుమారుడు తన తండ్రి బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేసి, విషయాన్ని తెలపడంతో సోమవారం ఉదయం బ్యాంక్‌కు వెళ్లి పరిశీలించుకున్నాడు. అదులో రూ.1.82 లక్షలు తక్కువగా ఉన్నట్లుగా నిర్ధారించుకున్న వాటి గురించి బ్యాంక్ అధికారులను ఆరా తీయడంతో వివిధ రకాల వస్తు కొనుగోళ్లకు యూపీఐ బదలాయింపులు చేసినట్లుగా నిర్ధారించారు. దీంతో జరిగిన మోసాన్ని గ్రహించిన అయ్యప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.20 వేలు విలువ చేసే సెల్‌ఫోన్‌ను అపహరించడమే కాక, దానిని ఉపయోగించి రూ.1.82 లక్షలు కాజేసిన యువకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment