సిద్ధేశ్వరా.. సిడిమాను చూడరా
అమరాపురం: సిద్ధేశ్వరుడి సిడిమాను ఉత్సవం కమనీయంగా సాగింది. హేమావతిలో వెలిసిన హెంజేరు సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం సిడిమాను ఉత్సవం నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం సిద్ధేశ్వరస్వామిని అర్చకులు వెండితో చూడముచ్చటగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయ ఆవరణలో కుడివైపున ఉన్న సిడిమాను ముందు ఉన్న కట్ట వద్దకు తీసుకువచ్చి పూజలు చేశారు. అనంతరం సిడిమాను ఉత్సవాన్ని నిర్వహించారు. సిడిమానుకు వేలాడేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. సాయంత్రం 5.30 గంటలకు ఉత్సవ కమిటీ చైర్మన్ కరేగౌడ, ఈఓ నరసింహరాజు, అర్చకులు, గ్రామ పెద్దలు సిడిమాను వద్దకు చేరుకుని ముందుగా నమోదు చేసుకున్న పేర్ల వారీగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన పెద్ద సిడిమానుకు ఒకవైపు భక్తులు వేలాడుతుండగా, మరోవైపు తిప్పుతుంటారు. ఇలా సిడిమానుకు వేలాడుతూ తిరగడం వల్ల కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. రాత్రి స్వామివారిని ముత్యాలపల్లకిలో కూర్చోబెట్టి ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ తిప్పేస్వామి, గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు. కాగా, బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం చిన్న రథోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆలయకమిటీ ఈఓ నరసింహరాజు, ఉత్సవ కమిటీ చైర్మన్ కరేగౌడ తెలిపారు.
సిద్ధేశ్వరా.. సిడిమాను చూడరా
Comments
Please login to add a commentAdd a comment