
ఆటో బోల్తా – మహిళ మృతి
ముదిగుబ్బ: ఆటో బోల్తాపడిన ఘటనలో ఓ ప్రయాణికురాలు మృతి చెందింది. ముదిగుబ్బ మండలం సంకేపల్లి క్రాస్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సోమవారం ఉదయం ప్రయాణికులతో కదిరికి వెళుతున్న ఆటో సంకేపల్లి క్రాస్ వద్దకు చేరుకోగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. ఆటోలో ప్రయాణిస్తున్న గుర్తు తెలియని మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. కాగా, మృతురాలు కదిరిలో ఉన్న తన కుమార్తెను చూసేందుకు వచ్చినట్టుగా తమతో చెప్పినట్లు పోలీసులకు తోటి ప్రయాణికులు తెలిపారు. తొలుత గుర్తు తెలియని మహిళ మృతిగా ముదిగుబ్బ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే గంటల వ్యవధిలోనే మృతురాలిని అనంతపురానికి చెందిన జల్లా భారతి(45)గా గుర్తించారు. కదిరిలో ఉన్న తన కుమార్తె జల్లా ఉదయలక్ష్మిని చూసేందుకు వచ్చిన ఆమె తిరిగి అనంతపురానికి వెళ్తుండగా ప్రమాదంలో మృతి చెందినట్లుగా పోలీసులు నిర్ధారించారు.
కనికరం లేని చంద్రబాబు
● అర్హులైన పేదలకు ఇంటి పట్టాలు
పంపిణీ చేయాలి ●
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
ప్రశాంతి నిలయం: గద్దెనెక్కి ఎనిమిది నెలలు గడుస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క నిరుపేదకూ కూటమి ప్రభుత్వం ఇంటి పట్టా ఇచ్చిన పాపాన పోలేదని, పేదల ఇంటి పట్టాలపై ముఖ్య మంత్రి చంద్రబాబుకు కనికరం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ట మండిపడ్డారు. జిల్లాలో అర్హులైన నిరుపేదలకు వెంటనే ఇంటి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సత్యమ్మ దేవాలయం నుంచి వేలాది మంది పేదలతో కలసి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకుని ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి నిరుపేదకు ఇంటి స్థలంతో పాటు రూ.4 లక్షలతో ఇంటిని నిర్మించి ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీనిచ్చారని గుర్తు చేశారు. ఎనిమిది నెలల గడుస్తున్నా ఇప్పటికీ ఆ హామీపై నోరు మెదపడం లేదన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం మేల్కొని వెంటనే పేదల ఇంటి పట్టాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల చొప్పున స్థలాన్ని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు చెల్లించాలన్నారు. టిడ్కో గృహ నిర్మాణాలను పూర్తి చేసి లబ్దిదారులకు అందజేయాలన్నారు. జిల్లాలో పేదల స్థలాలు కొల్లగొట్టడంపై ఉన్న శ్రద్ధ వారికి భూములు పంచడంపై చూపడం లేదని మండిపడ్డారు. మంత్రి సత్యకుమార్ అనుచరుడు, ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ వ్యవహారమే ఇందుకు నిదర్శనమన్నారు. ఆదినారాయణ యాదవ్ కబ్జా చేసిన పేదల భూములను త్వరలో సీపీఐ ఆధ్వర్యంలో ఆక్రమించుకుంటామన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓ సువర్ణకు అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామచంద్రయ్య, జగదీష్, సీపీఐ అనుబంధ సంఘాల నాయకులు దుర్గా భవానీ, ఆవుల శేఖర్, కాటమయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఆటో బోల్తా – మహిళ మృతి
Comments
Please login to add a commentAdd a comment