రాప్తాడు రూరల్: ప్రియురాలిపై హత్యాయత్నం చేసిన కేసులో ఎస్కేయూ పీజీ విద్యార్థి జైలు పాలయ్యాడు. ఇటుకలపల్లి పోలీసులు తెలిపిన మేరకు... గార్లదిన్నె మండలానికి చెందిన కురుబ బ్యాళ్ల విష్ణువర్దన్ ఎస్కేయూలో ఎంఎల్‌ఐసీ చదువుతున్నాడు. ఈ క్రమంలో ఎస్కేయూలో బీటెక్ చేస్తున్న అనంతపురం రూరల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో పరిచయమై, ప్రేమకు దారితీసింది. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. కొంత కాలంగా ఆమె స్వగ్రామానికి చెందిన మరో యువకుడితో చనువుగా ఉంటోందన్న అనుమానంతో విష్ణువర్దన్ రగిలిపోయాడు. ఫిబ్రవరి 27న యువతిని ఓ గదికి తీసుకెళ్లి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా వారిద్దరూ చనువుగా ఉన్న సమయంలో తీసుకున్న ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశాడు. ఘటనకు సంబంధించి బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఇటుకలపల్లి పోలీసులు... అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశులు నేతృత్వంలో దర్యాప్తు వేగవంతం చేశారు. మంగళవారం ఉదయం పూలకుంట గ్రామ శివారులోని కురుబ తిమ్మప్పస్వామి గుడి వద్ద తచ్చాడుతున్న నిందితుడు బ్యాళ్ల విష్ణువర్దన్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు. అతడి నుంచి ఓ ద్విచక్ర వాహనంతో పాటు మూడు సెల్‌ఫోన్లు, ఫొటోలు, వీడియోలు ఉన్న పెన్‌డ్రైవ్ స్వాధీనం చేసుకుని, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment