రంజాన్ మాసంలో మద్యం తాగొద్దన్నందుకు...
బత్తలపల్లి: ‘పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష ఉండక పోయినా పర్వాలేదు. మద్యం మాత్రం తాగొద్దు’ అని కుటుంబసభ్యులు చెప్పడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... బత్తలపల్లికి చెందిన షేక్ జిలాన్ సాహెబ్ కుమారుడు షేక్ మహబూబ్ బాషా(30)కు భార్య భానుబేగం, నాలుగేళ్ల వయసున్న కుమారుడు ఉన్నారు. బత్తలపల్లి కూడలిలో పాన్‌షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన మహబూబ్‌బాషా రోజూ వ్యాపారం ముగించుకుని ఫుల్‌గా మద్యం సేవించి ఇంటికి చేరుకునేవాడు. ఆ సమయంలో కుటుంబసభ్యులు నిలదీస్తే భార్యతో గొడవపడేవాడు. మద్యం తాగొద్దంటే తాను చనిపోతానని బెదిరించేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ఆలస్యంగా ఇంటికి చేరుకున్న మహబూబ్‌బాషాను భోజనానికి రావాలని భార్య పిలిచింది. అయితే తనకు భోజనం వద్దని తాను మద్యం తాగి వచ్చినట్లుగా తెలిపాడు. దీంతో అసహనానికి గురైన భార్య ‘నీవు మారవు. మా బతుకులు ఇంతే. కనీసం రంజాన్ మాసంలోనైనా ఉపవాస దీక్ష లేకపోయినా పర్వాలేదు... మద్యం మాత్రం తాగొద్దు’ అంటూ హితవు పలికి, ఏడుస్తున్న తన నాలుగేళ్ల వయసున్న కుమారుడిని ఎత్తుకుని సముదాయిస్తూ ఇంటి బయటకు వచ్చింది. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న మహబూబ్ బాషా.. తన కుమారుడి కోసం ఊయలగా వేసిన చీరతో ఉరి వేసుకున్నాడు. అదే సమయంలో ఇంట్లోకి వచ్చిన భానుబేగం కేకలు వేస్తూ ఎదిరింట్లో ఉన్న అత్తామామలను అప్రమత్తం చేసింది. కుటుంబసభ్యులందరూ కలసి మహబూబ్ బాషాను కిందకు దించి ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మహబూబ్‌బాషా మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment