ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి
పుట్టపర్తి టౌన్: ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే లాభాలు రైతులకు వివరించి జిల్లాలో విస్తీర్ణం పెరిగేలా వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు కృషి చేయాలని కలెక్టర్ చేతన్ ఆదేశించారు. ఊరూరా అవగాహన కార్యకమ్రాలు ఏర్పాటు చేసి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్నారు. మంగళవారం స్థానిక సాయి ఆరామంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం –ప్రజాభాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం’పై జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ టీఎస్ చేతన్ మాట్లాడుతూ... రైతు సేవా కేంద్రాల పరిధిలోని మహిళా సంఘాల ద్వారా ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రైతులకు పెట్టుబడి తగ్గించి ఆదాయం చేకూరే విధంగా సహకారాన్ని అందించాలన్నారు. జిల్లాలోని బీడు భూముల్లో ప్రకృతి వ్యవసాయ విధానాల్లో రైతులు పంటలు సాగు చేసేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారావ్, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, డీపీఎం లక్ష్మానాయక్, ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
తగ్గిన ఎండుమిర్చి ధర
హిందూపురం అర్బన్: ఎండుమిర్చి ధర కాస్త తగ్గింది. స్థానిక వ్యవసాయ మార్కెట్‌కు మంగళవారం 82.40 క్వింటాళ్ల ఎండుమిర్చి రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలం పాట నిర్వహించారు. ఇందులో మొదటి రకం ఎండుమిర్చి క్వింటా రూ. 13 వేలు, రెండో రకం రూ.8 వేలు, మూడో రకం రూ.7 వేల ప్రకారం ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. గత వారంతో పోలిస్తే క్వింటాపై ఎండుమిర్చి రూ.1,200 మేర తగ్గింది.
నెలాఖరు వరకూ
ఆ ప్యాసింజర్ రైళ్లు తిరగవ్!
గుంతకల్లు: కుంభమేళాకి వెళ్లిన ప్యాసింజర్ రైళ్లు తిరిగి గుంతకల్లు డివిజన్ చేరుకునేందుకు ఈ నెలాఖరు వరకూ సమయం పడుతుందని డివిజన్ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో తిరుపతి–కదిరిదేవరపల్లి (57405) ప్యాసింజర్ రద్దును ఈ నెల 30 వరకూ పొడిగించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా కదిరిదేవరపల్లి–తిరుపతి (57406) ప్యాసింజర్‌ను ఈ నెల 31 వరకు, గుంతకల్లు–తిరుపతి (57404) ప్యాసింజర్ 30 వరకు, తిరుపతి–గుంతకల్లు (57403) ప్యాసింజర్ ఈ నెల 31 వరకు తిరగవన్నారు. తిరుపతి–హుబ్లీ (57401) ప్యాసింజర్‌ను ఈ నెల 15 వరకు, హుబ్లీ–తిరుపతి ప్యాసింజర్ రద్దును ఈ నెల 16 వరకూ పొడిగించినట్లు వెల్లడించారు.
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి
Comments
Please login to add a commentAdd a comment