హంద్రీ–నీవాకు లైనింగ్ వద్దు
పుట్టపర్తి: హంద్రీ–నీవా కాలువకు సిమెంట్ లైనింగ్ పనులు వెంటనే రద్దు చేయాలని ఉమ్మడి అనంతపురం జిల్లా జలసాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కాలువ వెడల్పు కోసం ఇచ్చిన అనుమతుల మేరకు పనులు చేయాలని కోరారు. బుధవారం ఉమ్మడి అనంతపురం జిల్లా జలసాధన సమితి ప్రధాన కార్యదర్శి వాటర్‌షెడ్ గంగిరెడ్డి, ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, సభ్యులు నవీన్, జలీల్, రైతు కూలీ సంఘం నేత ఖాసీమ్, రైతులు ప్రభాకర్‌రెడ్డి తదితరులు బుక్కపట్నం మండలం జానకంపల్లి వద్ద హంద్రీ–నీవా కాలువ సిమెంట్ లైనింగ్ పనులకు భూమి పూజ చేసిన చోట ఆందోళన చేపట్టారు. హంద్రీ–నీవా కాలువ సిమెంట్ లైనింగ్ పనుల కోసం కూటమి ప్రభుత్వం జారీ చేసిన 404, 405 జీఓలను వెంటనే రద్దు చేయాలని, ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 10 క్యూసెక్కులకు పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు.
లైనింగ్‌తో తీరని నష్టం..
గత ఆరేళ్లుగా హంద్రీ–నీవా కాలువలో ఏడాదిలో ఆరు నెలలు నీరు ప్రవహిస్తుండగా.. భూగర్భ జలమట్టం పెరిగి బోరు బావుల్లో నీరు పుష్కలంగా ఉండేదని జలసాధన సమితి నేతలు గుర్తు చేశారు. తద్వారా రైతులు పంటలు పండించుకుంటూ హాయిగా ఉన్నారన్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం చేపట్టిన సిమెంట్ లైనింగ్‌తో భూ గర్భ జలాలు హరించుకుపోతాయని, బోర్లు ఒట్టిపోయి రైతులను తీరని నష్టం జరుగుతుందన్నారు. లైనింగ్ పనులు ఆపకపోతే ఉమ్మడి అనంతపురం జిల్లా మళ్లీ కరువుకోరల్లో చిక్కుకుంటుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
కాలువ వెడల్పుతో రైతులకు మేలు..
ఉమ్మడి అనంతపురం జిల్లా రైతుల సాగునీటి కష్టాలు చూసిన నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ హంద్రీ–నీవాకు కాలువ పనులు పూర్తి చేశారని జలసాధన సమితి నేతలు గుర్తు చేశారు. 2014లోనే జీడిపల్లి వరకు కృష్ణా జలాలను తీసుకొచ్చారని, 2017 నుంచి శ్రీసత్యసాయి జిల్లాకు హంద్రీ–నీవా ద్వారా సాగునీరు అందుతోందన్నారు. అయితే కాలువ వెడల్పు లేకపోవడంతో తగినంత నీరు తీసుకోలేకపోతున్నామన్నారు. ఈ క్రమంలోనే హంద్రీ–నీవా కాలువను వెడల్పు చేసేందుకు సిద్ధమైందన్నారు. మొత్తంగా 6,300 క్యూసెక్కుల కృష్ణాజలాలను తీసుకునేందుకు వైఎస్ జగన్ సర్కార్ 2021లో కాలువ వెడల్పు పనులకు రూ.6,182 కోట్లకు అనుమతులు మంజూరు చేసిందని జలసాధన సమితి నేతలు గుర్తు చేశారు. ఈ మేరకు పనులు చేపడితో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికై నా అనంత రైతన్న ఆవేదనను అర్థం చేసుకుని లైనింగ్ పనులు నిలిపివేసి హంద్రీ–నీవా కాలువ వెడల్పు పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
కాలువ వెడల్పుకు
చర్యలు తీసుకోవాలి
ఉమ్మడి అనంతపురం జిల్లా
జలసాధన సమితి డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment