ఆత్మ విశ్వాసానికి ప్రతిరూపం దాసరి లక్ష్మీదేవి
రెండు కాళ్లు చచ్చుబడినా... ఆమె జీవితంలో నిలబడింది. స్వశక్తితో జీవనం సాగిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఆ స్ఫూర్తిదాత పేరు దాసరి లక్ష్మీదేవి. తాడిమర్రి మండల కేంద్రానికి చెందిన దాసరి యంగన్న, నారాయణమ్మ దంపతులకు రెండో సంతానం దాసరి లక్ష్మీదేవి. ఆరు నెలల వయసులోనే పోలియో సోకి రెండు కాళ్లూ చచ్చుబడి పోయాయి. అయినా ఆమె తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ఆమె వయస్సు 45 ఏళ్లు. లక్ష్మీదేవి పెద్దగా చదువుకోకపోయినా...ఆర్థికంగా ఎవరిపైనా ఆధారపడకూడదని భావించేది. ఈక్రమంలోనే ఆదాయ మార్గాలను అన్వేషించింది. 2002లో ఆర్డీటీ సహకారంతో రూ.1,500 మొత్తంతో గ్రామం నడిబొడ్డున చిన్నపాటి బంకు ఏర్పాటు చేసుకుని వ్యాపారం ప్రారంభించింది. మొదట్లో ట్రైసైకిల్‌పై ఆమె కూర్చుంటే వాళ్ల నాన్న బండిని తోసుకుంటూ అంగడి వరకూ వచ్చేవాడు. తిరిగి సాయంత్రం వచ్చి ఇంటికి తీసుకుని వెళ్లే వాడు. కష్టపడటం ఒక్కటే తెలిసిన లక్ష్మీదేవి చిన్నపాటి వ్యాపారంతోనే తల్లిదండ్రులకు చేదోడుగా నిలిచింది. అయితే 2006 లక్ష్మీదేవి తల్లి నారాయణమ్మ అకాలం మరణం ఆమెను కుంగదీసింది. అయినా జీవితంపై ఎంతో ఆశ ఉన్న లక్ష్మీదేవి ధైర్యంతో ముందుకు సాగి తిరిగి వ్యాపారం ప్రారంభించింది. అంతా బాగుందనుకుంటున్న తరుణంలోనే...తండ్రి యంగన్న వయస్సు మీదపడి ఇంటికే పరిమితమయ్యాడు. దీంతో లక్ష్మీదేవి భవిష్యత్ ప్రశ్నార్థకమైంది. కనీసం అంగడి వరకూ తీసుకెళ్లే తోడులేక తీవ్ర ఇబ్బందులు పడింది. ఈ క్రమంలోనే రూ.40 వేలు వెచ్చించి ట్రైసైకిల్‌ను కొనులోగు చేసింది. దాన్ని రిక్షాలా మార్చి మోటర్ ఏర్పాటు చేసుకుంది. అప్పటి నుంచి ఎవరి సాయం లేకుండా ఆమె సొంతంగా ట్రైసైకిల్‌పైనే వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. రోజూ రూ.400 నుంచి రూ.500 వరకూ వ్యాపారం చేసుకుంటూ ఒకరికి భారం కాకుండా స్వశక్తితో జీవిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. తన కాళ్లు మాత్రమే చచ్చుబడ్డాయని, సంకల్పం కాదని చెబుతున్న దాసరి లక్ష్మీదేవి కళ్లలో జీవితం పట్ల ప్రేమ కనిపిస్తుంది. – తాడిమర్రి:
Comments
Please login to add a commentAdd a comment