వైఎస్‌ జగన్‌ గొప్ప మనసు.. | - | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ గొప్ప మనసు..

Published Wed, Mar 12 2025 7:26 AM | Last Updated on Wed, Mar 12 2025 7:23 AM

వైఎస్

వైఎస్‌ జగన్‌ గొప్ప మనసు..

2019 మే నెలలో అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సర్కారు విద్యార్థులకు రాజకీయాలకు అతీతంగా అండగా నిలిచింది. 2017–19 మధ్య టీడీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలను సైతం చెల్లించి చేయూతనిచ్చింది. అలాగే నాలుగేళ్లలో జిల్లాలో 44,082 మంది ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఒక్క విద్యా దీవెన కిందే రూ.314 కోట్లు అందించింది. వసతి దీవెన కింద జిల్లాలోని 43,301 మంది విద్యార్థులకు జగన్‌ సర్కార్‌ రూ.162.38 కోట్ల అందించింది. కానీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్‌.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులు విడుదల చేయకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. వసతి దీవెనకు కూడా రూపాయి కూడా విడుదల చేయలేదు.

● హిందూపురానికి చెందిన రమేష్‌కు అనంతపురంలోని కళాశాలలో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్సెస్‌ పూర్తి చేశాడు. బెంగళూరులోని ఓ ఎంఎన్‌సీ కంపెనీలో ఏడాదికి రూ.9 లక్షల వేతనంతో ఉద్యోగం సంపాదించాడు. అయితే, ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇవ్వాలని కంపెనీ కోరగా.. రమేష్‌ కళాశాలలో సంప్రదించాడు. ప్రభుత్వం ఇంతవరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయలేదని, సర్టిఫికెట్లు కావాలంటే ఫీజు చెల్లించాలని కళాశాల యాజమాన్యం చెప్పింది. దీంతో రమేష్‌ అప్పు చేసి ఫీజు కట్టి సర్టిఫికెట్లు తీసుకున్నాడు.

● నిరుపేద కుటుంబానికి చెందిన ధర్మవరానికి చెందిన మహిత అనంతపురం జిల్లాలోని ఓ కళాశాలలో ఎంసీఏ పూర్తి చేసింది. హైదరాబాద్‌లోని ఓ పేరొందిన కంపెనీలో ఉద్యోగం రావడంతో తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారు. అయితే సర్టిఫికెట్లు సమర్పించాల్సి రావడంతో కళాశాలను వెళ్లగా...ఫీజు బకాయిలు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు అందిస్తామని నిర్వాహకులు తేల్చిచెప్పారు. దీంతో మహిత తండ్రి వడ్డీకి అప్పు తెచ్చి మరీ ఫీజు చెల్లించారు.

..ఇలా జిల్లాలోని వేలాది మంది విద్యార్థులు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌ చేయకపోవడంతో సర్టిఫికెట్లు కళాశాలల్లోనే ఉండిపోగా..చాలా మంది ఉద్యోగం సంపాదించినా అందులో చేరలేకపోయారు.

పుట్టపర్తి: విద్యార్థుల జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకుండా వారి భవిష్యత్తును అంధకారంలోకి నెడుతోంది. అలాగే వసతి దీవెనకు కూడా పూర్తిగా మంగళవారం పాడింది. ఇక ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి ఊసే లేకుండా 9 నెలలుగా పాలన సాగిస్తోంది.

నిధులు నిలిపిన కూటమి

వాస్తవానికి గడిచిన విద్యా సంవత్సరంలో చివరి రెండు త్రైమాసికాలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన గత జూన్‌ నెలలో చెల్లించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. మళ్లీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వచ్చి ఉంటే ఆ నిధులు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లోకి జమయ్యేవి. కానీ, అధికారంలోకి వచ్చిన ‘కూటమి’ నిధులు చెల్లించకుండా నిలిపివేసింది. పాత విద్యా సంవత్సరంలో రెండు త్రైమాసికాలు, ఈ విద్యా సంవత్సరంలో పూర్తయిన మూడు త్రైమాసికాలకు కలిపి రూ. 100 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ఈ విద్యా సంవత్సరంలో ‘వసతి దీవెన’ పథకానికి కూడా చంద్రబాబు సర్కారు పూర్తిగా మంగళం పాడటం గమనార్హం.

ఫీజు కడితేనే సర్టిఫికెట్లు..

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి 5 త్రైమాసికాలుగా అన్ని రకాలు ఫీజులు పెండింగ్‌లో ఉంచి పేద విద్యార్థుల భవిష్యత్‌ను అంధకారం చేస్తోంది. గత ప్రభుత్వం కంటే మెరుగ్గా విద్యార్థులను ఆదుకుంటామని ఎన్నికల వేళ ప్రగల్భాలు పలికిన కూటమి నేతలు.. అధికారం చేపట్టాక వాటన్నింటినీ తుంగలో తొక్కారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఉన్నత విద్య, ఉద్యోగాల సమయంలో సర్టిఫికెట్లు తప్పనిసరి కావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఫీజులు చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతిస్తామని కళాశాలల నిర్వాహకులు తేల్చి చెబుతుండటంతో బాధిత తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ కాలేజీలకు ఫీజులు చెల్లిస్తున్నారు.

పరిశ్రమల స్థాపన ఊసే లేదు

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటు చేసింది. దీంతో పరిపాలన సౌలభ్యం ఏర్పడింది. అలాగే హిందూపురం పారిశ్రామిక వాడతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. తద్వారా స్థానిక యువతకు ఉపాధి లభించింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న జిల్లా కేంద్రంతో పాటు మిగిలిన ఏ ప్రాంతంలోను నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు ఒక్క పరిశ్రమ స్థాపించలేదు.

నోటిఫికేషన్‌ లేదు... భృతి అందదు

రాష్ట్రంలో ఉన్న 20 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, లేకపోతే ఉద్యోగం వచ్చేవరకూ నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తామని 2024 ఎన్నికలప్పుడు కూటమి నేతలు నమ్మ బలికారు. ఉద్యోగల భర్తీకి ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదు. దీంతో జిల్లాలోని సుమారు 2 లక్షల మంది నిరుద్యోగులు భృతి కోసం ఎదురుచూస్తున్నారు. నెలకు రూ.3 వేల చొప్పున ఇప్పటికి 10 నెలలకు ఒక్కొక్కరికి రూ.30 వేల కింద రూ.600 కోట్లు చంద్రబాబు సర్కార్‌ నిరుద్యోగులకు బకాయి ఉంది.

మెడికల్‌ కళాశాలకు మొండి చేయి

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జిల్లాలో ఏకై క ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను పెనుకొండలో ఏర్పాటు చేసింది. ఈ భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులు ఎక్కడికక్కడ నిలిపివేసింది. మెడికల్‌ కళాశాలను ప్రైవేట్‌ పరం చేసేందుకు సిద్ధమైంది. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ జిల్లా నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్నా.. మెడికల్‌ కళాశాల పనులు ముందుకు సాగకపోవడం దురదృష్టకరమని జిల్లా వాసులు పెదవి విరుస్తున్నారు.

పెనుకొండలో ‘యువత పోరు’ పోస్టర్లను

ఆవిష్కరిస్తున్న ఉషశ్రీచరణ్‌

10 నెలల భృతి ఇవ్వాల్సిందే

గత జగన్‌ సర్కార్‌ తొలి రెండేళ్లలోనే ఏకంగా 5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసింది. ప్రస్తుత కూటమి సర్కార్‌ అధికారం చేపట్టి 9 నెలలు పూర్తవుతున్నా... ఇప్పటి దాకా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి కూడా మంజూరు చేయలేదు. డీఎస్సీ నోటిఫికేషన్‌ అయినా విడుదల చేయాలి. లేకపోతే నిరుద్యోగ భృతి కింద ఒక్కొక్కరికి 10 నెలల కాలానికి రూ.30 వేలు ఇవ్వాలి.

– అనిల్‌, నిరుద్యోగి, బుక్కపట్నం

దీవెన అందలేదు

గత ప్రభుత్వంలో ప్రతి మూడు నెలలకోసారి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సక్రమంగా పడేది. గతంలో బకాయిలు ఉన్నా ..వైఎస్‌ జగన్‌ చెల్లించారు. పేదింటి బిడ్డలను అక్కున చేర్చుకున్నారు. నేను బీటెక్‌

ద్వితీయ సంవత్సరం చదువుతున్నా. ఇప్పటికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సొమ్ము బకాయి ఉంది. వసతి దీవెన సొమ్ము రూ.20 వేలు జమ కాలేదు. వస్తుందో...రాదో తెలియని అయోమయం నెలకొంది. అప్పటికీ, ఇప్పటికీ తేడా తెలుస్తోంది. విద్యార్థులను రాజకీయాల్లోకి లాగకుండా దన్నుగా నిలవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది.

– విశ్వనాథ్‌, బీటెక్‌ విద్యార్థి, పుట్టపర్తి

పుట్టపర్తి/పెనుకొండ రూరల్‌: విద్యార్థులు, యువతను దగా చేసిన కూటమి ప్రభుత్వం మెడలు వంచడమే ధ్యేయంగా బుధవారం వైఎస్సార్‌ సీపీ ‘యువత పోరు’కు సిద్ధమైంది. విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన, నిరుద్యోగులకు భృతి మంజూరు చేయకపోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కదం తొక్కనున్నాయి. ఉదయం 9.30 గంటలకు పుట్టపర్తిలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ ఉంటుందని జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యువకులు, వైఎస్సార్‌ సీపీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌, పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి పిలుపునిచ్చారు. అంతకుముందు మంగళవారం ఉషశ్రీచరణ్‌ పెనుకొండలోని పార్టీ కార్యాలయంలో ‘యువత పోరు’ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... విద్యార్థులు, యువకుల భవిష్యత్‌ కోసమే వైఎస్సార్‌ సీపీ ఉద్యమానికి సిద్ధమైందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
వైఎస్‌ జగన్‌ గొప్ప మనసు..
1
1/3

వైఎస్‌ జగన్‌ గొప్ప మనసు..

వైఎస్‌ జగన్‌ గొప్ప మనసు..
2
2/3

వైఎస్‌ జగన్‌ గొప్ప మనసు..

వైఎస్‌ జగన్‌ గొప్ప మనసు..
3
3/3

వైఎస్‌ జగన్‌ గొప్ప మనసు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement