అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
అనంతపురం: ఆలయ నిర్మాణానికి పోగు చేసిన మొత్తాన్ని దొంగలించిన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.10.05 లక్షల నగదు, పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. అనంతపురంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను అడిషనల్ ఎస్పీ డీవీ రమణమూర్తి వెల్లడించారు. కణేకల్లు మండలం సొల్లాపురం గ్రామంలో సీతారామాంజినేయులు ఆలయ నిర్మాణం కోసం గ్రామస్తులు చందాల రూపంలో పోగు చేసిన రూ.12 లక్షలను గుర్రం లక్ష్మన్న అనే వ్యక్తి వద్ద భద్రపరిచిన విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని దుండగులు అపహరించారు. ఘటనపై ఈ నెల 4న కణేకల్లు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
పాములు పట్టుకుంటూ ..
తమిళనాడుకు చెందిన గురునాథం రాజు.. బాతులు మేపుతో జీవనం సాగించేవాడు. గురునాథానికి వరుసకు మేనమామ అయిన జానయ్య ఇటుకల బట్టీలో పనిచేస్తుండేవాడు. వీరి తల్లిదండ్రులు ఊరారా తిరుగుతూ గ్రామాల్లో పాములు ఆడిస్తూ జీవనం సాగించేవారు. తమిళనాడు బాతులు మేపుతున్న సమయంలోనే అక్కడే వీరికి కార్తీక్ అనే యువకుడు పరిచయమై, మంచి స్నేహితులుగా మారారు. ఈ క్రమంలో వలస వచ్చిన ముగ్గురూ గత 20 రోజులుగా కణేకల్లు మండలంలో మోటార్ సైకిల్‌పై గ్రామాల్లో సంచరిస్తూ ఊరు చివర గుడారాలు వేసుకుని రెండు, మూడు రోజులు అక్కడే ఉంటూ పాములు ఆడిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆలయాల్లో హుండీలను అపహరించి, అందులోని భక్తుల కానుకలనూ అపహరించేవారు.
దారిన పోతూ చోరీ
ఈ నెల 2న కర్ణాటక ప్రాంతానికి వెళ్లిన గురునాథం రాజు, జానయ్య, కార్తీక్... రాత్రి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యారు. అర్ధరాత్రి సమయంలో సొల్లాపురం వద్దకు చేరుకున్న వారికి గుర్రం లక్ష్మన్న అనే వ్యక్తి తాళం వేసిన ఇల్లు కనిపించడంతో పథకం వేసి 3వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత ఇనుపరాడ్‌తో తలుపు తాళాలు మెండి లోపలకు ప్రవేశించారు. స్క్రూడ్రైవర్ సాయంతో బీరువా తెరిచి అందులో ఉన్న రూ.12 లక్షల నగదు అపహరించారు. చోరీ అనంతరం జీడిపల్లి డ్యామ్ చేరుకుని రూ.50 వేలను జానయ్య తీసుకుని స్వగ్రామానికి వెళ్లిపోయాడు. మిగిలిన డబ్బు తర్వాత పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయడంతో భయపడి కర్ణాటకలోని సిరిగుప్పకు మకాం మార్చేందుకు మంగళవారం జీడిపల్లి డ్యామ్ మీదుగా ద్విచక్ర వాహనంపై వెళుతుండగా పోలీసులు గుర్తించి కణేకల్లు క్రాస్ వద్ద అరెస్ట్ చేశారు. గురునాథం రాజుపై వైఎస్సారఱ్ జిల్లా యర్రగుంట్ల, కర్నూలు జిల్లా హాలహర్వి పీఎస్ల పరిధిల్లో చోరీ కేసులు ఉన్నాయి. తమిళనాడులోని పోలూరు, శ్రీపెరంబూరు పీఎస్‌ల పరిధిల్లోనూ ద్విచక్రవాహనాల అపహరణ కేసులు, కర్ణాటకలోని బొమ్మనహళ్లి, ఏపీలోని వి.కోట పీఎస్ పరిధిలోనూ మోటార్ సైకిళ్ల చోరీ కేసులు ఉన్నాయి. నిందితుల అరెస్ట్‌లో చొరవ చూపిన కళ్యాణదుర్గం డీఎస్పీ పి.రవిబాబు, రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ, కణేకల్లు ఎస్‌ఐ నాగమధు, డి.హీరేహళ్ ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డిను ఏఎస్పీ అభినందించారు.
రూ.10.05 లక్షల నగదు, పల్సర్ బైక్ స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment