కార్మికులను మోసగిస్తున్న ప్రభుత్వం
అనంతపురం అర్బన్: వేలాది మంది ప్రజల దాహార్తిని తీరుస్తున్న శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులను ప్రభుత్వం దగా చేస్తోందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.ఓబుళు మండిపడ్డారు. కార్మికులకు 10 నెలల వేతనం, 35 నెలల పీఎఫ్ బకాయిలు చెల్లించకుండా అన్యాయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేతన, పీఎఫ్ బకాయిల మంజూరుతో పాటు లీటర్ బేస్ విధానం రద్దు చేయాలనే డిమాండ్‌తో మంగళవారం కలెక్టరేట్ ఎదుట శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులు నిరసన తెలిపారు. ఓబుళు మాట్లాడుతూ... శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కింద 600 మంది కార్మికులు పనిచేస్తున్నారన్నారు. వేతనాల కోసం ఏడాదిలో మూడు దఫాలు సమ్మెలు చేయాల్సి వస్తోందన్నారు. సరైన బడ్జెట్ కేటాయించి కార్మికులకు వేతనం, పీఎఫ్ సక్రమంగా చెల్లించాలన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన లీటర్ బేస్ విధానం కారణంగా నీటి సరఫరాలో చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. అయితే వీటికి కార్మికులను బాధ్యులను చేస్తూ ఒక్కొక్క కార్మికుడికి రూ.2,500 చొప్పున వేతనంలో కోత విధించడం సబబు కాదన్నారు. సరైన వసతులు కల్పించని కారణంగా తలెత్తుతున్న ఈ వైఫల్యానికి తొలుత ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉందన్నారు. ఆ తరువాత చీఫ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్, ఈఈలు, డీఈఈ వరకు అధికారులను ఎందుకు బాధ్యులను చేయడం లేదని ప్రశ్నించారు. పంపు హౌస్‌లో ఆపరేటర్లు, హెల్పర్లకు మూడు షిఫ్ట్‌లు ఉంటే... కార్మికులను తగ్గించి రెండు షిఫ్ట్‌గా పనిచేయించాలని టెండర్లలో పెట్టినట్లు తెలుస్తోందన్నారు. దీంతో వందల గ్రామాలకు నీరందిస్తున్న ఈ పథకం నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందన్నారు. పథకాన్ని కాపాడుకునేందుకు పోరాటం సాగిస్తామని, ప్రజలు కూడా ముందుకురావాలని పిలుపునిచ్చారు. అనంతరం డీఆర్‌ఓ ఎ.మలోలను ఆయన చాంబర్‌లో నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో శ్రీరామరెడ్డి నీటి సరఫరా పథకం కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రాము, నాయకులు హొన్నూరు స్వామి, ప్రభాకర్, సోము, చిక్కన్న, హనుమంతరాయ, నాగేంద్ర, కార్మికులు పాల్గొన్నారు.
వేతన బకాయిల కోసం ఏడాదిలో మూడు సార్లు ధర్నాలు చేయాలా?
సరైన బడ్జెట్ కేటాయించి జీతభత్యాలు సక్రమంగా చెల్లించాలి
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబుళు
Comments
Please login to add a commentAdd a comment