‘దుర్గం’లో దోపిడీ దొంగల బీభత్సం
కళ్యాణదుర్గం: పట్టణంలో మంగళవారం అర్థరాత్రి దోపిడీ దొంగలు భీభత్సం సృష్టించారు. కత్తులు చేత పట్టుకుని హల్‌చల్ చేశారు. ఏకంగా రెండిళ్లలో చోరీలకు పాల్పడి, మరో ఇంట్లోకి చొరబడేందుకు విఫలయత్నం చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.... కళ్యాణదుర్గంలోని పార్వతీ నగర్ మొదటి కాలనీలో నివాసముంటున్న దీప, అనిల్ దంపతులు మంగళవారం రాత్రి భోజనం ముగించుకుని ఇంటికి తాళం వేసి పైకెళ్లి నిద్రించారు. విషయాన్ని గుర్తించిన దుండగులు లోపలకు చొరబడి బీరువాను ధ్వంసం చేసి, నాలుగు తులాల బంగారు నగలు, రూ.1.60 లక్షల నగదు అపహరించారు. అనంతరం పక్కనే ఉన్న శిల్ప అనే మహిళ ఇంట్లో చొరబడి బ్రాస్‌లైట్‌ను అపహరించారు. అక్కడి నుంచి ముదిగల్లు బైపాస్ సమీపానికి చేరుకుని శ్రీకాంత్ అనే వ్యక్తికి చెందిన నాలుగు గొర్రెలను ఎత్తుకెళ్లారు.
ముసుగులు ధరించి.. కత్తులు చేతపట్టి
పార్వతీనగర్ శివారు ప్రాంతంలోని అక్కమాంబ కొండ సమీపంలో నివాసముంటున్న మీ–సేవ కేంద్రం నిర్వాహకుడు బాబు ఇంటి వద్ద మంగళవారం అర్థరాత్రి 2.10 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు ముఖాలకు ముసుగులు ధరించి, కత్తులు చేతపట్టుకుని హల్‌చల్ చేశారు. రెండు, మూడు నిమిషాల పాటు అటుఇటు కలియతిరిగి, ఒకరు కాంపౌండ్ వాల్ ఎక్కి లోపలికి చొరబడే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో కుక్కలు మొరగడంతో అప్రమత్తమైన దుండగులు కాంపౌండ్‌లో నుంచి బయటపడి పారిపోయారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీకెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమయ్యాయి.
ఘటన స్థలాలను పరిశీలించిన
డీఎస్పీ రవిబాబు
పార్వతీనగర్‌లో వరుస దోపిడీల సమాచారం అందుకున్న డీఎస్పీ రవిబాబు, అర్బన్ సీఐ యువరాజు, సిబ్బంది బుధవారం ఉదయం అక్కడకు చేరుకుని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీంను రంగంలో దింపి నిందితుల ఆధారాలు సేకరించారు. కాగా, దుండగులు కత్తులు పట్టుకుని సంచరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. వచ్చిన వారు దొంగలా లేక పార్థీ గ్యాంగ్ ముఠా సభ్యులనే అనుమానాలు స్థానికుల నుంచి వ్యక్తమయ్యాయి.
రెండిళ్లలో వరుస చోరీలు
ముదిగల్లు బైపాస్‌లో
నాలుగు గొర్రెల అపహరణ
అర్ధరాత్రి కత్తులతో హల్‌చల్ చేసిన దుండగులు
Comments
Please login to add a commentAdd a comment