అనంతపురం అగ్రికల్చర్: గత ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వేరుశనగ, కంది, పత్తి, ఆముదం, మొక్కజొన్న తదితర ప్రధాన పంటలు తక్కువ విస్తీర్ణంలో సాగులోకి రావడంతో గత సెప్టెంబర్‌లో ప్రఽత్యామ్నాయ విత్తనాల కింద జిల్లా రైతులకు ఉలవ, పెసర, అలసంద, కొర్ర తదితర వాటిని 80 శాతం రాయితీతో అందించారు. ఇందులో ప్రధానంగా మండలాల వారీగా ఎంత మంది రైతులు ప్రత్యామ్నాయం కింద ఉలవ విత్తనాలు తీసుకున్నారు, వారు విత్తనాలు సాగు చేశారా? పంటలను ఈ–క్రాప్‌లోకి నమోదు చేశారా? తదితర అంశాలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడానికి బృందాలు (వెరిఫికేషన్ టీమ్స్) ఏర్పాటు చేస్తూ వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాకు ప్రత్యామ్నాయం కింద 27 వేల క్వింటాళ్ల విత్తనాలు కేటాయించగా... ఆలస్యంగా పంపిణీ మొదలు పెట్టడంతో 80 శాతం రాయితీతో 10 వేల క్వింటాళ్ల విత్తనాన్ని అందించారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లాకు శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్లు (ఏడీ), అగ్రికల్చర్స్ ఆఫీసర్ల (ఏఓ)తో కూడిన 8 మందితో నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. వీరు తమకు కేటాయించిన మండలాల్లో పర్యటించి డీ–కృషి యాప్‌లో విత్తన పంపిణీ డేటా ఆధారంగా రాండమ్‌గా 150 మంది రైతులను కలసి వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. డీ–కృషి యాప్, ఈ–క్రాప్ డేటా క్రాస్ చెక్ చేసుకుని 10 ఫార్మాట్ల కింద సమగ్ర నివేదిక సమర్పించాలి. అలాగే శ్రీసత్యసాయి జిల్లాలో పరిశీలనకు అనంతపురం జిల్లాకు చెందిన నలుగురు ఏడీఏలు, నలుగురు ఏఓలతో నాలుగు బృందాలు ఏర్పాటు చేశారు.
పదో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం
లేపాక్షి: మండలంలోని పులమతి పంచాయతీ పరిధిలోని పి.సడ్లపల్లి గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి బాబు ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు తెలిపిన మేరకు... పులమతిలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి చదువుతున్న బాబు.. ఇటీవల వార్షిక పరీక్షలు సక్రమంగా రాయలేకపోతున్నానని తరచూ బాధపడేవాడు. ఈ క్రమంలోనే గురువారం మధ్యాహ్నం బాటిల్‌లో పెట్రోల్ తీసుకెళ్లి ఇంటి బయట శరీరంపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. విషయం గమనించిన స్థానికులు వెంటనే మంటలు ఆర్పి వేశారు. 108 అంబులెన్స్ ద్వారా హిందూపురంలోని జిల్లాస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురానికి రెఫర్ చేశారు. ఘటనపై ఎస్‌ఐ నరేంద్ర కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
చేనేత కార్మికుడి ఆత్మహత్యాయత్నం
ధర్మవరం అర్బన్: స్థానిక సుందరయ్యనగర్‌కు చెందిన చేనేత కార్మికుడు ముద్దుకృష్ణ గురువారం తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆయనను కాపాడు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. కాగా, ఆయన ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై ధర్మవరం రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.
యువకుడిపై
పోక్సో కేసు నమోదు
ధర్మవరం అర్బన్: మైనర్ బాలికను లైంగిక వేధింపులకు గురి చేసిన యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ధర్మవరం ఒకటో పట్టణ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన వివరాలు వెల్లడించారు. ధర్మవరంలోని ఓ కాలనీకి చెందిన బాలిక 9వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో అదే వీధికి చెందిన యువకుడు లక్ష్మణ్... మూడు వారాలుగా బాలికను లైంగిక వేధింపులకు గురి చేస్తూ వచ్చాడు. పలుమార్లు బాలిక తల్లిదండ్రులు దండించినా అతని ప్రవర్తనలో మార్పురాలేదు. వేధింపులు తారస్థాయికి చేరుకోవడంతో గురువారం రాత్రి 10.30 గంటలకు పోలీసులకు బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ప్రత్యామ్నాయంపై పరిశీలకుల బృందం