
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
కదిరి టౌన్: తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కదిరి పీఎస్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను డీఎస్పీ శివనారాయణస్వామి వెల్లడించారు. కదిరిలోని హిందూపురం క్రాస్ రోడ్డులో నివాసముంటున్న బాబాఫకృద్దీన్ గత నెల ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో కలసి షాపింగ్‌కు వెళ్లారు. విషయాన్ని గమనించిన దుండగుడు అదే రోజు అర్ధరాత్రి ఇంటి వెనుక తలుపులు బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించి బీరువాలోని రూ.9.70 లక్షల నగదు, రెండు తులాల బంగారం చైన్ అపహరించాడు. ఘటనకు సంబంధించి బాధితుడి ఫిర్యాదు మేరకు గత నెల 17న కేసు నమోదు చేసిన పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లినప్పుడు అలాంఖాన్ వీధికి చెందిన పఠాన్ షాబీర్ ఇంటి మిద్దైపె నుంచి దూకినట్లుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో షాబీర్‌పై అనుమానం వచ్చి సీఐ వి.నారాయణరెడ్డి,ఎస్‌ఐ బాబ్జాన్ రెండు బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. విషయం తెలుసుకున్న పఠాన్ షాబీర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి షాబీర్ కోసం గాలిస్తుండగా బుధవారం ఉదయం కదిరి మండలం సున్నపుగుట్ట తండా కొత్త బైపాస్ వద్ద తచ్చాడుతుండగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో బాబాఫకృద్దీన్ ఇంట్లో చోరీ చేసినట్లుగా అంగీకరించడంతో రూ.9.70 లక్షల నగదు, 2 తులాల బంగారం నగను స్వాధీనం చేసుకుని, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్ట్
కదిరి టౌన్: పాత కక్షల నేపథ్యంలో వ్యక్తిపై కత్తితో దాడి చేసిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. వివరాలను బుధవారం ఆయన వెల్లడించారు. కదిరిలోని వాణి వీధిలో నివాసముంటున్న షేక్ సమీవుల్లా, వలీసాహెబ్ రోడ్డుకు చెందిన దాదాపీర్ కలసి ఉమ్మడి వ్యాపారం చేసుకునేవారు. మంగళవారం రాత్రి సమీవుల్లాపై దాదాపీర్ కత్తితో దాడి చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం ఉదయం దాదాపీర్‌ను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.