బత్తలపల్లి: స్థానిక జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంలో నలుగురు ఉపాధ్యాయులు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులు తెలిపిన మేరకు.. బత్తలపల్లి మండలం నల్లబోయనపల్లిలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న పలువురు ఉపాధ్యాయులు సమీపంలోని అనంతపురం నగరంలో నివాసముంటూ రోజూ విధులకు వచ్చి వెళుతుంటారు. ఈ క్రమంలో సమయానికి పాఠశాలకు చేరుకునేందుకు వీలుగా ఓ ప్రైవేట్ క్యాబ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. గురువారం విధులకు హాజరైన ఉపాధ్యాయులు సాయంత్రం పాఠశాలల వేళలు ముగిసిన తర్వాత క్యాబ్‌లో అనంతపురానికి తిరుగు ప్రయాణమయ్యారు. చిత్రావతి నది బ్రిడ్జి దాటిన తర్వాత ఉప్పర్లపల్లి క్రాస్ వద్దకు చేరుకోగానే ముదిగుబ్బ వైపు నుంచి వేగంగా వస్తున్న కారు వెనుక నుంచి క్యాబ్‌ను ఢీ కొంది. దీంతో క్యాబ్ అదుపు తప్పి డివైడర్ ఎక్కి బోల్తాపడింది. ఘటనలో ఉపాధ్యాయులు ఆనందరెడ్డి, బిల్లే ఉమాదేవి, పి.ఉమాదేవి, పార్వతమ్మకు తీవ్రగాయాలయ్యాయి. రామచంద్ర, మహబూబ్‌బాషా, చాంద్‌బాషా, విశాల, అనురాధ, రికార్డు అసిస్టెంట్ పార్వతమ్మ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే 108 వాహనంలో బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి రెఫర్ చేశారు. ఘటనపై బత్తలపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, ప్రమాద విషయం తెలుసుకున్న ఎంఈఓలు చాముండేశ్వరి, సుధాకర్‌నాయక్, నల్లబోయనపల్లి హెచ్‌ఎం ప్రహ్లాదనాయుడు, పాఠశాల తల్లిదండ్రుల కమిటీ మాజీ చైర్మన్ హరినాథరెడ్డి, నాగేశ్వరరెడ్డి, భరత్‌కుమార్‌రెడ్డి, ఓబిరెడ్డి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సంజీవరెడ్డి, రజనీకాంత్‌రెడ్డి, నాగేశ్వరయ్య, అనిల్‌చౌదరి, నాగరాజు, ముదిగుబ్బ మండల నాయకులు సి.రామకృష్ణారెడ్డి, చంద్రమోహన్, చిట్టిబాల ఓబిరెడ్డి, ఎమ్మార్సీ కార్యాలయ సిబ్బంది, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. ఫోన్ ద్వారా క్షతగాత్రులతో డీఈఓ కిష్టప్ప మాట్లాడారు. వారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఎంఈఓలను ఆదేశించారు.
నలుగురు ఉపాధ్యాయులకు
తీవ్రగాయాలు
మరో ఆరుగురికి స్వల్పగాయాలు
క్యాబ్‌ను ఢీ కొన్న కారు