
బీసీలపై దాడులకు మంత్రి సమాధానం చెప్పాలి
● బీసీలకు రక్షణ కల్పించలేని
బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత
● వెంటనే తన పదవికి
రాజీనామా చేయాలి
● జిల్లాలో కురుబలపై
వరుస దాడులు దుర్మార్గం
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీ చరణ్
సాక్షి పుట్టపర్తి: జిల్లాలో బీసీలపై జరుగుతున్న దాడులకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత బాధ్యత వహించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీ చరణ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆమె పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ లేఖను విడుదల చేశారు. జిల్లాలో వరుసగా బీసీలపై, ముఖ్యంగా కురుబలపై దాడులు జరగడం దారుణమన్నారు. ఇటీవల పేరూరుకు చెందిన లాయర్ కురుబ నాగిరెడ్డిపై కొందరు అనాగరికంగా దాడి చేశారన్నారు. అలాగే సిద్దరాంపురంలో కురుబ బాలన్నపై దాడి చేసిన ఘటన గుర్తు చేశారు. రామగిరి మండలంలోని పాపిరెడ్డిపల్లిలోనూ ఆదివారం కురుబ లింగమయ్య కుటుంబ సభ్యులపై అనాగరికంగా దాడి చేస్తే, లింగమయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. జిల్లాలో వరుసగా జరుగుతున్న హింసాత్మక ఘటనలు కురుబ సామాజిక వర్గానికి చెందిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితకు పట్టవా...అని ప్రశ్నించారు. కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించే తీరిక కూడా ఆమెకు లేకపోవడం అన్యాయమన్నారు. జిల్లాలో కురుబలపై జరుగుతున్న అనాగరికమైన ఘటనలకు మంత్రి సవిత బాధ్యత వహించాలన్నారు. కురుబ కులస్తులపై ఏ మాత్రం ప్రేమ, బాధ్యత ఉన్నా .. మంత్రి తన పదవికి రాజీనామా చేసి బాధితుల తరఫున నిలబడాలని డిమాండ్ చేశారు.