
‘ఏడు’పిస్తున్న బాబు
అనంతపురం అగ్రికల్చర్: ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు గత పది నెలలుగా ఎలాంటి సాయం చేయకుండా రైతులను ఏడిపిస్తోంది. గత ఖరీఫ్‌లో జిల్లా అంతటా 3.20 లక్షల హెక్టార్లలో పంటలు దారుణంగా దెబ్బతిన్నా... కరువు జాబితాలో కేవలం ఏడు మండలాలను ప్రకటించి రైతును దగాకు గురి చేశారు. తాజాగా ప్రస్తుత రబీకి సంబంధించి ఏడు మండలాలను కరువు జాబితాలో చేరుస్తూ సోమవారం రెవెన్యూ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. వర్షపాతం, పంటల సాగు విస్తీర్ణం, దిగుబడులు, ఉష్ణోగ్రతలు, గాలిలో తేమశాతం, చీడపీడలు తదితర కొలమానాల ఆధారంగా జాబితా ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాల పరిధిలో 51 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. అందులో 37 మండలాలు తీవ్ర కరువు, మరో 14 మండలాలు సాధారణ కరువు (మోడరేట్) జాబితాలోకి చేర్చి ఉత్తర్వులు ఇచ్చారు.
‘శ్రీ సత్యసాయి’లో ఒకటే..
అనంతపురం జిల్లాకు సంబంధించి బెళుగుప్ప, గుంతకల్లు, పెద్దవడుగూరు, తాడిపత్రి, యల్లనూరు, యాడికి మండలాలు తీవ్ర కరువు జాబితాలో ఉండగా విడపనకల్లును సాధారణ కరువు జాబితాలో చేర్చారు. శ్రీ సత్యసాయి జిల్లాలో కేవలం రొద్దం మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించారు. అనంతపురం జిల్లాలో ప్రధానంగా ఉరవకొండ, వజ్రకరూరు, పుట్లూరు తదితర మండలాల్లో పప్పుశనగ అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. అలాంటి మండలాలను పక్కన పెట్టడంపై రైతులు మండిపడుతున్నారు. ఓవరాల్‌గా ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో అక్టోబర్‌లో 100.9 మి.మీ గానూ 135.1 మి.మీ వర్షం కురిసింది. నవంబర్‌లో 28.6 మి.మీ గానూ 18.1 మి.మీ, డిసెంబర్‌లో 9.8 మి.మీ గానూ 17.3 మి.మీ వర్షం కురిసింది. మొత్తమ్మీద రబీలో 139.3 మి.మీ గానూ 22.5 శాతం అధికంగా 170.6 మి.మీ వర్షం పడింది. వర్షపాతం కాస్తంత అధికంగా నమోదైనా వర్షపు రోజులు (రెయినీడేస్) కేవలం 13 నమోదు కావడం గమనార్హం. దీంతో పంటల సాగు అతికష్టమ్మీద సాగింది. రబీలో 1,18,330 హెక్టార్లకు గానూ 67 శాతంతో 79,360 హెక్టార్లలో మాత్రమే పంటలు వేశారు. అందులో ప్రధానపంట, వర్షాధారంగా వేసే పప్పుశనగ 50 వేల హెక్టార్లలో సాగైంది. ఆ తర్వాత జొన్న, మొక్కజొన్న, ఉలవ తదితర పంటలు కొంత విస్తీర్ణంలో సాగులోకి వచ్చాయి. పంట దిగుబడుల విషయంలో జిల్లా అంతటా ఒకే రకంగా ఉన్నా... కరువు జాబితాలో మాత్రం కేవలం ఏడింటిని చేర్చడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వకుండా..
2023 రబీలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 17 కరువు మండలాలకు సంబంధించి రూ.37 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ ఇప్పటికీ ఇవ్వలేదు. అలాగే గత రబీ అంటే చంద్రబాబు సర్కారు హయాంలో ఏడు మండలాల రైతులకు రావాల్సిన రూ.20 కోట్లు కూడా అందించ లేదు. ఈ రెండు జాబితాలకు సంబంధించి కేంద్ర కరువు బృందాలు జిల్లాకు వచ్చి వెళ్లినా పైసా కూడా విడుదల చేయకపోవడం గమనార్హం. ఇదే కాదు...‘అన్నదాత సుఖీభవ’ లేదు, పంటల బీమా కింద పరిహారం అందలేదు. రైతు ఆత్మహత్యలకు సంబంధించి బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదు. ఇలా గత 10 నెలల నుంచి నయాపైసా ఇవ్వకండా నిలువునా మోసం చేస్తున్నారు. గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన పంట నష్టానికి సీజన్ ముగిసేలోపు ఇన్‌పుట్ సబ్సిడీ అందించి ఆదుకుంది. అలాగే క్రమం తప్పకుండా రైతు భరోసా, ఉచిత పంటల బీమా కింద పరిహారం పెద్ద ఎత్తున అందించి చేయూతనిచ్చింది.
రబీ కరువు జాబితాలో ఈ సారీ ఏడు మండలాలే
ఉత్తర్వులు జారీ చేసిన
చంద్రబాబు ప్రభుత్వం
గత ఖరీఫ్, రబీలో పంటల నష్టానికి ఇప్పటికీ ‘ఇన్‌పుట్’ ఇవ్వని వైనం