సోమందేపల్లి: మండలంలోని మేకలపల్లి సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ నాగేంద్రబాబు(20) మృతిచెందాడు. గురువారం ఇసుక లోడ్‌తో పెనుకొండకు వెళ్లి అన్‌లోడ్ చేసిన అనంతరం తన స్వగ్రామమైన రొద్దం మండలం నల్లూరుకు వెళుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన నాగేంద్రబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.
‘ఎస్‌ఐ సుధాకర్‌యాదవ్‌ను సస్పెండ్ చేయాలి’
అనంతపురం కార్పొరేషన్: శ్రీసత్యసాయి జిల్లా రామగిరి పీఎస్ ఎస్‌ఐ సుధాకర్‌యాదవ్‌ను సస్పెండ్ చేయాలంటూ వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌని నాగన్న, సమాచార హక్కు చట్టం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం అనంతపురం జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. హైకోర్టు చీవాట్లు పెట్టినా వారి పనితీరులో మార్పు రావడం లేదన్నారు. వైఎస్సార్‌సీపీకి చెందిన న్యాయవాది నాగిరెడ్డి, వైస్ ఎంపీపీ బోయ రామాంజినేయులు ఈ నెల 26న ఎంపీడీఓ కార్యాలయానికి వెళితే వారిపై దాడులకు తెగబడిన టీడీపీ గుండాలపై చర్యలు తీసుకోవాల్సిన ఎస్‌ఐ సుధాకర్‌యాదవ్ ఏకపక్షంగా వ్యవహరించడాన్ని ఆక్షేపించారు. సమావేశంలో లీగల్ సెల్ నగరాధ్యక్షుడు ఎస్ వెంకటరాముడు, తదితరులు పాల్గొన్నారు.
‘ఏపీ సూపర్ కప్’ విజేత గోదావరి క్లబ్
అనంతపురం: రాష్ట్రంలో తొలిసారిగా అనంతపురంలోని ఆర్డీటీ క్రీడాగ్రామం వేదికగా నిర్వహించిన ఏపీ సూపర్ కప్ ఫుట్‌బాల్ టోర్నీ విజేతగా గోదావరి క్లబ్ జట్టు నిలిచింది. గురువారం కొల్లేరు ఫుట్‌బాల్ క్లబ్ (ఏలూరు, తూర్పుగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు) – గోదావరి ఫుట్‌బాల్ క్లబ్ (తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలు) జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. 2–1 గోల్స్ తేడాతో గోదావరి క్లబ్ జట్టు విజయకేతనం ఎగురవేసింది. ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోటగిరి శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరై విజేత జట్టుకు ట్రోఫీతో పాటు రూ.5 లక్షల నగదు పురస్కారాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి డేనియల్ ప్రదీప్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ట్రాక్టర్ బోల్తా ... డ్రైవర్ మృతి
ట్రాక్టర్ బోల్తా ... డ్రైవర్ మృతి