పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
ప్రశాంతి నిలయం: జిల్లా వ్యాప్తంగా ఈనెల 17 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి 10వ తరగతి పరీక్షలు నిర్వహణపై తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, మండల విద్యాశాఖ అధికారులతో పరీక్షలకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లుపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 17 నుంచి రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రాల పరిధిలో జిరాక్స్, నెట్ సెంటర్లను మూసి వేయించాలన్నారు. జిల్లాలో 23,730 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. అందులో 22,295 మంది రెగ్యూలర్, 1435 మంది ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 104 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఓపెన్ స్కూల్ విద్యార్థులు 780 మంది 11 సెంటర్లలో పరీక్షలకు హాజరవుతున్నట్లు చెప్పారు. ఒక్కో విడతలో 1186 మంది చొప్పున రెండు విడతలకు 2,372 మంది ఇన్విజిలేటర్లును నియమిస్తున్నట్లు వివరించారు. 6 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించామని, వాటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఆర్‌ఓ విజయసారథి, డీఈఓ కృష్టప్ప తదితరులు పాల్గొన్నారు.
మొల్ల మాంబ జీవితం ఆదర్శం
తొలి తెలుగు మహిళా కవయిత్రి మొల్ల మాంబ జయంతిని గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌హాల్‌లో ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో భాగంగా కలెక్టర్ టీఎస్ చేతన్ మొల్ల మాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ మొల్ల మాంబ జీవితం ఆదర్శనీయమన్నారు. 16వ శతాబ్దానికి చెందిన కవయిత్రి మొల్ల మాంబ రామాయణాన్ని సంస్కృతంలో నుంచి తెలుగులోకి అనువదించిన తొలి తెలుగు కవయిత్రిగా గుర్తించబడ్డారన్నారు. జాతికి మొల్ల మాంబ చేసిన సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆమె జయంతిని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
కలెక్టర్ టీఎస్ చేతన్
Comments
Please login to add a commentAdd a comment