నీరు తరగని పాలబావి
కదిరి: ముత్యాలచెరువుకు సమీపంలో పాలబావి ఉంది. ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి భక్తురాలైన కర్ణాటకకు చెందిన సాసవుల చిన్నమ్మ దీన్ని రాత్రికి రాత్రి తవ్వించినట్లు బ్రహ్మాండ పురాణం చెబుతోంది. ఈ బావిని కొంత లోతు తవ్విన తర్వాత కింద నుంచి కోడికూతతో పాటు రోకలితో ధాన్యం దంచుతున్న శభ్దం వినబడింది. ఈ విషయాన్ని వారు సాసవుల చిన్నమ్మకు చెప్పడంతో కింద మరో లోకం ఉందని భావించి తవ్వడం ఆపేశారు. తర్వాత వచ్చే వేసవికి ఆ బావి పొంగి ప్రవహించడం అందరినీ ఆశ్యర్యానికి గురి చేసింది. ఆ నీరు పాలవలె ఉండటం మరింత నివ్వెర పరిచింది. అప్పుడు ఈ ప్రాంత వాసులు సాసవుల చిన్నమ్మ భక్తిని మరింత మెచ్చుకున్నారు. ఎంతటి కరువు కాటకాలొచ్చినా ఈ పాలబావిలో మాత్రం నీళ్లు తగ్గవు. ఈ నీటిని నరసింహస్వామి భక్తులు పవిత్ర తీర్థంగా భావిస్తారు. శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ దక్షిణ గోపురాన్ని కూడా సాసవుల చిన్నమ్మే నిర్మించినట్లు బ్రహ్మాండ పురాణం ద్వారా తెలుస్తోంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే కర్ణాటకకు చెందిన భక్తులందరూ ఈ పాలబావిని చూసి వెళతారు. కాగా క్షీర కేతుడనే రాజు పుత్ర సంతానం కోసం ఈ పాలబావిలో స్నానమాచరించి తర్వాత నారసింహుని దర్శించుకున్నారని, అందుకే క్షీరతీర్థమని పిలుస్తున్నారని మరో కథనం.
పులగం వండిన గ్రామమే పులగంపల్లి
ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి భక్తురాలు సాసవుల చిన్నమ్మ తమ పరివారంతో కర్ణాటక నుంచి శ్రీవారి దర్శనం కోసం వస్తుండేది. దారి మధ్యలో మధ్యాహ్న సమయంలో తమ వెంట వచ్చిన వారి ఆకలి తీర్చేందుకు సాసవుల చిన్నమ్మ కదిరి–బెంగళూరు రహదారి పక్కన పులగం వండి వడ్డించడం మొదలెట్టింది. తమ వెంట వచ్చిన వారితో పాటు దారి వెంబడి వెళ్లే వారందరికీ వడ్డించినా ఆ పాత్రలోని పులగం తరగలేదు. సాసవుల చిన్నమ్మ పులగం వండిన ప్రాంతాన్ని పులగంపల్లిగా నామకరణం చేశారు. ఇప్పటికీ పులగంపల్లిగా పిలుస్తున్నారు.
రాత్రికి రాత్రే తవ్వించిన సాసవుల చిన్నమ్మ
నీరు తరగని పాలబావి
Comments
Please login to add a commentAdd a comment