అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షల నిర్వహణలో విద్యాశాఖ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపై పాఠశాల విద్య రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) కొరడా ఝళిపించారు. ఐదుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇన్విజిలేషన్ డ్యూటీల కేటాయింపుల్లో గందరగోళం, అంధులు, పక్షవాత బాధితులు, దివ్యాంగ టీచర్లు, చివరకు రిటైర్డ్ అయిన వారినీ విధులకు కేటాయించిన వైనంపై ‘సాక్షి’లో వరుస కథనాలు వెలువడ్డాయి. ‘పది పరీక్షల నిర్వహణలో గందరగోళం’, ‘పదింతల నిర్లక్ష్యం’ కథనాలు విద్యాశాఖలో ప్రకంపనలు సృష్టించాయి. సామాజిక మాద్యమాల్లోనూ వైరల్ అయ్యాయి. ప్రాథమిక విద్య కమిషనర్, కలెక్టర్ కూడా స్పందించారు. ఈ క్రమంలో పాఠశాల విద్య ఆర్జేడీ శామ్యూల్ చర్యలకు ఉపక్రమించారు. ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందనాయక్, డెప్యూటీ డీఈఓ శ్రీనివాసరావు, అనంతపురం ఎంఈఓ వెంకటస్వామి, సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణ, పరీక్షల విభాగం అసిస్టెంట్ రామాంజనేయులుకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారిచ్చే వివరణను బట్టి తదుపరి చర్యలుంటాయని అధికారులు చెబుతున్నారు. ప్రధాన కారణంగా భావిస్తున్న కీలక అధికారిపై వేటు తప్పదనే ప్రచారం సాగుతోంది.
‘టిస్’ ఉన్నా అలసత్వం..
టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం (టిస్) ద్వారా ఇటీవల ఉపాధ్యాయుల పూర్తి వివరాలు సేకరించారు. ఏ స్కూల్‌లో ఏ టీచరు పని చేస్తున్నాడు... పేరు, వయసు, పుట్టిన రోజు, పీహెచ్ కేటగిరీ తదితర వివరాలున్నాయి. ఫిబ్రవరి 28న రిటైర్డ్ అయిన వారి వివరాలు కూడా ఇందులో అప్‌డేట్ అయ్యాయి. ఈ వివరాలన్నీ డీఈఓ కార్యాలయంలో ప్రభుత్వ పరీక్షల విభాగం పక్క గదిలోనే లభిస్తాయి. అయినా ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం చూస్తుంటే పరీక్షల నిర్వహణ విభాగం అదికారులు ఎంత నిర్లక్ష్యంగా పనిచేశారో అర్థం చేసుకోవచ్చు.
ఎంఈఓలు, హెచ్‌ఎంలకు పంపి ఉంటే...
10–15 రోజుల ముందే ఎంఈఓల ద్వారా ప్రధానోపాధ్యాయులకు జాబితాలు పంపి రిమార్కులు అడిగి ఉంటే కూడా చాలా వరకు తప్పిదాలకు అవకాశం ఉండేదికాదు. అలా చేయకుండా కేవలం పరీక్షల విభాగం ఒంటెద్దు పోకడలతో తీసుకున్న నిర్ణయాలు అనేకమంది టీచర్లను ఇక్కట్లు పాలు చేశాయి. ఈ క్రమంలోనే అంధులు, పక్షవాత బాధితులు, చంటిపిల్లల తల్లులు, బాలింతలు, దివ్యాంగ టీచర్లు, రిటైర్డ్ టీచర్లు, మెడికల్ లీవ్‌లో ఉన్న వారినీ ఇన్విజిలేటర్లుగా నియమించారు. ఇలాంటి వారే 200 మంది దాకా ఉన్నట్లు తెలిసింది. పరీక్ష కేంద్రాల చీఫ్‌లకు అందజేసి చేతులు దులుపుకోవడం వల్ల సమాచార లోపించి ఆర్డర్లు జారీ చేసి రెండు రోజులు దాటినా 40 శాతానికి మందికి పైగా ఉత్తర్వులు అందజేలేదు. ఈ విషయంపైనా ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నారు.
ఇన్విజిలేషన్ డ్యూటీల్లో
అవకతవకలపై ఆర్జేడీ చర్యలు
ఐదుగురికి షోకాజ్ నోటీసులు
తీవ్ర చర్చనీయాంశమైన
‘సాక్షి’ వరుస కథనాలు