
చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి
చిలమత్తూరు: ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... చిలమత్తూరు గ్రామానికి చెందిన ఖలీల్ (40)కు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. పెయింటింగ్ పనులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో గత శుక్రవారం పనికి వెళ్లిన ఆయన చింత చిగురు కోసమని చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు అదుపు తప్పి కిందపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అటుగా ఎవరూ వెళ్లకపోవడంతో ఈ విషయం వెలుగు చూడలేదు. ఆదివారం ఉదయం అటుగా వెళ్లిన వారు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఎండ తీవ్రతకు మృతదేహం బొబ్బలెక్కి ఉబ్బిపోయింది. దుర్వాసన వెదజల్లుతోంది. మృతదేహం వద్ద లభ్యమైన ఆధారాలను బట్టి మృతుడిని ఖలీల్‌గా నిర్ధారించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.