
ఆర్డీటీని కాపాడుకుందాం
అనంతపరం టవర్‌క్లాక్: నిరుపేదల జీవనోపాధుల కోసం విశేష కృషి చేస్తున్న ఆర్డీటీకి నిధులు రాకుండా కేంద్రంలోని కూటమి ప్రభుత్వం అడ్డుకుంటోందని, ఇలాంటి తరుణంలో ఆర్డీటీని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి.రాంభూపాల్ పిలుపునిచ్చారు. ఆర్డీటీని కాపాడుకుందామనే డిమాండ్‌పై అనంతపురంలోని పెన్షనర్స్ భవన్‌లో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశంలో రాంభూపాల్ మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఆర్డీటీకు విదేశీ నిధులు రాకుండా అడ్డుపడిందన్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. దీని వల్ల సంస్థ సేవలు నిలిచి పోయే పరిస్థితి వచ్చిందన్నారు. నిత్యం కరువు కాటకాలతో విలవిల్లాడుతున్న జిల్లాకు ఆర్డీటీ వరదాయినిగా నిలిచిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్డీటీకి నిధులు అందకపోతే నష్టపోయేది పేదలేనన్నారు. మతం పేరుతో బీజేపీ ఇలాంటి దురాగతాలకు పాల్పడడం తగదన్నారు. కులాలు, మతాలకు అతీతంగా సేవలు అందిస్తున్న సంస్థపై ఆంక్షలు సరికాదన్నారు. పేదలు ఐక్యతతో ఉద్యమాలు చేపట్టి ఆర్డీటీని కాపాడుకోవల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. ఈ పోరాటాలకు కుల, ప్రజాసంఘాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సంస్థ అందజేస్తున్న ఉచిత విద్యతో ఎందరో ఇంజినీర్లు, డాక్టర్లుగా జీవితంలో స్థిరపడ్డారన్నారు. తక్షణమే కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి ఆర్టీటీకి విదేశీ నిధులు అందేలా చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున పోరాటాలు సాగిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రజాసంఘాలు, కుల సంఘాల నాయకులు గోవిందరాజులు, ఎస్.ఎం. బాషా, సాకే హరి, నెరమెట్ల ఎల్లన్న, ఓ.నల్లప్ప, కృష్ణమూర్తి, చంద్రశేఖర్ రెడ్డి, ఓబులేసు, రాహుల్, శివారెడ్డి, కేశవరెడ్డి, చంద్రశేఖర్, శ్రీనివాసులు, సాయికుమార్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్