అసిస్టెంట్ ప్రొఫెసర్ మృతిపై అనుమానాలు
బుక్కరాయసముద్రం: మండలంలోని జంతలూరు వద్ద ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ వద్దతిలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ యోజితా సాహో (27) మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బీకేఎస్ పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. చత్తీస్‌ఘడ్ రాష్ట్రం రాయ్‌పూర్ జిల్లా దుర్గ్ గ్రామానికి చెందిన యోజిత సాహో బుక్కరాయసముద్రంలోని తాను నివాసముంటున్న అద్దె గృహంలో శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు రాయ్‌పూర్ నుంచి ఆదివారం అనంతపురంలోని సర్వజనాస్పత్రికి చేరుకున్నారు. కుమార్తె మృతదేహాన్ని చూడగానే బోరున విలపించారు. అనంతరం ఆమె అద్దెకున్న ఇంటిని పరిశీలించారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఈ సందర్భంగా వారు పోలీసులకు తెలిపారు. కుమార్తె ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో ఆ దిశగా అనంతపురం డీఎస్పీ వెంకటేశ్వర్లు, బీకేఎస్ సీఐ కరుణాకర్ కేసు నమోదు చేశారు. మృతురాలి ఐ ఫోన్, లాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వర్సిటీ అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో యోజితా మృతదేహాన్ని తీసుకుని తల్లిదండ్రులు స్వగ్రామానికి తరలివెళ్లారు.
అరటి తోట దగ్ధం
బెళుగుప్ప: అగ్ని ప్రమాదంలో అరటి తోట దగ్ధమైంది. బాధిత రైతు తెలిపిన మేరకు... బెళుగుప్ప మండలం గంగవరం గ్రామానికి చెందిన రైతు నరసింహులు తనకున్న ఆరు ఎకరాల్లో అరటి పంట సాగు చేపట్టాడు. ప్రస్తుతం పంట కోత దశలో ఉంది. ఆదివారం ఉదయం తోట వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వద్ద షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుని నిప్పు రవ్వలు ఎగిసి పడి మంటలు వ్యాపించాయి. దీంతో సుమారు 2.5 ఎకరాల్లోని డ్రిప్ పరికరాలతో పాటు అరటి చెట్లు కాలిపోయాయి. సమాచారం అందుకున్న కళ్యాణదుర్గం అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసింది. దాదాపు రూ.6 లక్షల మేర నష్టం వాటిల్టినల్లు బాధిత రైతు వాపోయాడు.
ప్రైవేట్ స్కూల్ టీచర్ దుర్మరణం
ధర్మవరం: మండలంలోని చిగిచెర్ల వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ ప్రైవేట్ స్కూల్ టీచరు దుర్మరణం పాలయ్యారు. వివరాలు... ధర్మవరంలోని మార్కెట్ వీధిలో నివాసముంటున్న బోయ నారాయణస్వామి (54) ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నారు. వ్యక్తిగత పనిపై తన స్నేహితుడు సాంబశివుడుతో కలసి ధర్మవరం నుంచి ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై అనంతపురానికి బయలుదేరిన ఆయన... మార్గమధ్యంలో చిగిచెర్ల దాటగానే ఓబిరెడ్డి తోట మలుపు వద్ద స్పీడ్ బ్రేకర్‌ను గమనించక వేగంగా దూసుకెళ్లారు. ఘటనలో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడింది. కల్వర్టు వద్ద లోతైన గుంతలో పడిన నారాయణస్వామి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. వాహనంపై వెనుక కూర్చొన్న సాంబశివుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఘటనపై ధర్మవరం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్ మృతిపై అనుమానాలు
Comments
Please login to add a commentAdd a comment