తూతూమంత్రంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక
● ఈమె పేరు లక్ష్మీనరసమ్మ. రొద్దం మండలం కలిపి గ్రామం. సర్వే నంబరు 261–1లో ఎకరా, సర్వే నంబరు–491లో 1.04 ఎకరాలు, సర్వే నంబరు 50లో 60 సెంట్లు భూమి ఉంది. అన్ని చోట్ల ఆమె కుటుంబ సభ్యులే సాగులో ఉన్నారు. అయితే ఆ భూమి మొత్తాన్ని ఆమెకు తెలియకుండా వేరే వాళ్లు ఆన్‌లైన్‌లో ఎక్కించుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవస్థలు పడుతున్నట్లు లక్ష్మీనరసమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి.. తిరిగి.. అలసిపోయి.. చివరకు కలెక్టరేట్ మెట్లు ఎక్కినట్లు వాపోయారు.
● ఇక్కడ కనిపిస్తోన్న రైతు పేరు వెంకటరెడ్డి. కొత్తచెరువు మండలం పోతులకుంట గ్రామం. ఈయనకు సర్వే నంబరు–127లో 31 సెంట్లు, సర్వే నంబరు–137లో 3 సెంట్లు, సర్వే నంబరు–208లో 45 సెంట్ల భూమి ఉంది. అదే గ్రామానికి చెందిన కూటమి నేతలు కొందరు ఆ భూమిని ఆక్రమించారు. దీంతో బాధిత రైతు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇప్పటికీ విచారణ పూర్తి కాలేదు. అయితే ఇంతలోనే కూటమి నేతలు ఆ స్థలంలో రోడ్లు వేశారు. దీంతో వెంకటరెడ్డి నాలుగు నెలల వ్యవధిలోనే 11 సార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేదని వాపోయారు.
● ఈ చిత్రంలో కలెక్టర్‌కు అర్జీ ఇస్తున్న రైతు పేరు చిమిరాల జగన్నాథ్. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎనుములపల్లి గ్రామం. పుట్టపర్తి రెవెన్యూ పొలం సర్వే నంబర్ 295–1లోని 32 సెంట్లలో 11 సెంట్లు, సర్వే నంబర్ 296–3లోని 34 సెంట్లలో 12 సెంట్లు, సర్వే నంబర్ 296–7లోని 30 సెంట్లుపైకి 10 సెంట్ల భూమి ఉంది. మూడు సర్వే నంబర్లలో కలిపి మొత్తం 33 సెంట్లకు సంబంధించి రిజిష్టర్ డాక్యుమెంట్లు, లింకు డాక్యుమెంట్లు ఉన్నాయి. అయితే ఆ పొలం ఇతరులు ఆక్రమించారు. అధికారులకు విన్నవించినా.. న్యాయం జరగలేదు. భూమిని సర్వే చేయించి తనకు పాసు పుస్తకం మంజూరు చేయాలని సోమవారం కలెక్టర్‌ను కోరాడు.
సాక్షి, పుట్టపర్తి
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ జిల్లాలో ప్రజా ప్రదక్షిణల వేదికగా సాగుతోంది. ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై గ్రామ, మండల స్థాయిలో అర్జీలిచ్చి...అక్కడ పరిష్కారం కాక ఎంతో ఆశతో ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ‘పరిష్కార వేదిక’కు వస్తున్నారు. అయితే ఇక్కడా సరైన పరిష్కారం దొరకడం లేదు. దీంతో ప్రజలు ఒకే సమస్యపై పదేపదే అర్జీలివ్వడం...అధికారులు వాటిని తీసుకుని బుట్టదాఖలు చేయడం పరిపాటిగా మారింది. ఫలితంగా ప్రతి సోమవారం అర్జీల సంఖ్య 400 దాటిపోతోంది. అధికారులు మాత్రం సమస్యలన్నీ పరిష్కరించినట్లు చెబుతున్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ను సోమవారం ‘సాక్షి’ విజిట్ చేయగా.. పలు విషయాలు వెలుగు చూశాయి.
రెవెన్యూ సమస్యలే అధికం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు దీరాక రెవెన్యూ సమస్యలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఏ గ్రామంలో చూసినా భూ సమస్యలు పెరిగిపోయాయి. ఇక తమ భూమి కబ్జా చేశారని అందే వినతులు వందల్లోనే ఉంటున్నాయి. కబ్జా రాయుళ్లు కూటమి పార్టీల నేతలు కావడంతో అధికారులు పట్టించుకోవడం లేదు. దశాబ్దాల కాలంగా సాగులో ఉన్నోళ్లను కాదని.. వన్–బీలలో పేర్లు మారుస్తున్నారు. వాటన్నింటినీ సరిదిద్దుకునేందుకు నిజమైన అర్హులు అధికారుల చుట్టూ నెలల తరబడి తిరుగుతూనే ఉన్నారు. ఒక్కో సమస్యపై పదిసార్లకుపైగా వినతులు ఇచ్చినట్లు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చిన పది మంది పైగా చెప్పడం గమనార్హం.
తూతూ మంత్రంగా పరిష్కారం
‘అర్జీలు పునరావృతం కారాదు’ అని కలెక్టర్ చేతన్ ప్రతి వారం ఆదేశిస్తున్నా.. సిబ్బంది పాటించడం లేదు. ప్రజల నుంచి అర్జీలు అందిన వెంటనే పరిష్కరించినట్లు ఆన్‌లైన్‌లో చూపిస్తున్నారు. దీంతో సమస్య తీరక.... ప్రజలు కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వ్యయప్రయాసల కోర్చి కలెక్టరేట్‌కు వచ్చి ఏకంగా కలెక్టర్‌కే అర్జీ ఇచ్చినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఈ ప్రభుత్వంతో పాటు అధికారులపై కూడా నమ్మకం పోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
20,070 ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అందిన అర్జీలు
4,713 సర్వే సమస్యలపై అందిన అర్జీలు
7,608 పెండింగ్‌లో ఉన్న అర్జీలు
(గణాంకాలు 2024 జూన్ 19 నుంచి 2025 మార్చి 17 వరకు)
పదుల సార్లు విన్నవించినా
పరిష్కారం కాని సమస్యలు
ఒకే సమస్యపై పదే పదే వస్తోన్న ఫిర్యాదులు
కూటమి హయాంలో పెరిగిన
భూ సమస్యలు
అధికారుల అలసత్వంతో పెరిగిన భూకబ్జాలు
టీడీపీ నేతలు విచ్చలవిడిగా
కబ్జా చేస్తున్నట్లు ఆరోపణలు
మొక్కుబడిగా పరిష్కారం
చూపిస్తున్నారని బాధితుల ఆవేదన
పరిష్కార మార్గం చూపిస్తున్నాం
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో నమోదయ్యో ప్రతి అర్జీకి పరిష్కార మార్గం చూపుతున్నాం. అర్జీలు పునరావృతం కాకూడదన్నదే ముఖ్య ఉద్దేశం. ఒకసారి ఆన్‌లైన్‌లో నమోదు చేసిన సమస్య మరోసారి పునరావృతం కాకుండా చూస్తున్నాం. రెవెన్యూలో అవకతవకలు జరగకుండా చూసుకుంటాం. కబ్జాల విషయంలో విచారణ చేయించి.. బాధితులకు న్యాయం చేస్తున్నాం.
– టీఎస్ చేతన్, కలెక్టర్, శ్రీసత్యసాయి జిల్లా
పరిహారం అందలేదు
నాకు గ్రామంలో సర్వే నంబరు 27–4లో రెండు ఎకరాలుండగా... హౌసింగ్ కోసం అధికారులు తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదు. పోనీ సాగుచేసుకుందామని పొలంలోకి వెళ్తే అధికారులు అడ్డు పడుతున్నారు. గృహ నిర్మాణ సంస్థకు సంబంధించిన మెటీరియల్ అక్కడ దింపారు. న్యాయం చేయాలని అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా.
– బోయ నరసింహప్ప, మణేసముద్రం, హిందూపురం
తూతూమంత్రంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక
తూతూమంత్రంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక
తూతూమంత్రంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక
తూతూమంత్రంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక
తూతూమంత్రంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక
తూతూమంత్రంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక
తూతూమంత్రంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక
Comments
Please login to add a commentAdd a comment